పాన్‌గల్: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈ నెల 28న మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారులు పాల్గొంటారని.. మండల ప్రజలు తమ సమస్యలను తెల్ల కాగితంపై రాసి వాట్సప్ నంబర్ 81858 85127కు పంపించాలని పేర్కొన్నారు. మండల ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.
నేడు పోలీస్ సంఘం ఎన్నికలు
కొత్తకోట రూరల్: కొత్తకోట సర్కిల్ పరిధిలోని ఐదు పోలీస్‌స్టేషన్లకు చెందిన 100 మంది పోలీసు సిబ్బంది గురువారం జరగనున్న పోలీస్ సంఘం ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో కురుమయ్య గౌడ్, వెంకటస్వామి, మధు, నరేష్ బరిలో నిలిచారు. 30 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 70 మంది కానిస్టేబుళ్లు ఓటు వేయనున్నారు. ఎన్నికల అధికారిగా కొత్తకోట సీఐ ఓడి రమేష్ వ్యవహరించనుండగా, పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కొత్తకోట ఎస్‌ఐ ఎం.విక్రమ్ తెలిపారు.
170.477 మి.యూ. విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. బుధవారం ఎగువన 2 యూనిట్ల నుంచి 78 మెగావాట్లు, 92.876 మి.యూ., దిగువన 2 యూనిట్ల నుంచి 80 మెగావాట్లు, 77.601 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 170.477 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం విద్యుదుత్పత్తికి 14 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని తెలిపారు.


