వనపర్తి/ఖిల్లాఘనపురం/పాన్‌గల్/వీపనగండ్ల/చిన్నంబావి: జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎకై ్సజ్, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఖిల్లాఘనపురం మండలంలోని కర్నెతండా ఎత్తిపోతల పథకాన్ని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, రాజేష్‌రెడ్డితో కలిసి మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రూ.87.53 కోట్లతో ఏర్పాటు చేసిన కర్నెతండా లిఫ్టు ద్వారా నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని గిరిజన తండాల్లో 851 ఎకరాలకు, వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘనపురం, పెద్దమందడి, వనపర్తి మండలాల్లోని గ్రామాలు, గిరిజన తండాల్లోని 3,384 ఎకరాలకు సాగునీరు అందించే వెసులుబాటు ఉంటుందన్నారు. గిరిజనుల ఆకాంక్ష మేరకు ఈ లిఫ్టుకు శ్రీసంత్ సేవాలాల్ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరు మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపర్చుతామని పేర్కొన్నారు. 3.35 కోట్ల మందికి సన్న బియ్యం, 7 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, 70 వేల ఉద్యోగాలు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తండాలో నెట్‌వర్క్ సమస్యను అధిగమించేందుకు కర్నెతండా ప్రాంతంలో సెల్‌టవర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత పాలకులు అనేక ప్రాజెక్టులను పూర్తి చేశామని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకుంటూ ప్రజలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.
రూ.41.75 కోట్లతో..
పాన్‌గల్ మండలంలోని దావాజిపల్లిలో వనపర్తి–2 ప్యాకేజీ కింద రూ.41.75 కోట్ల నిధులతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఆర్‌అండ్‌బీ పాన్‌గల్ నుంచి దావాజిపల్లి, ఖానాపూర్ మీదుగా పుల్గచెర్ల వరకు ఉన్న రహదారిని రెండు లైన్లుగా మార్చనున్నట్లు వెల్లడించారు. అనంతరం 2.14 కోట్లతో గ్రామంలో ఏర్పాటు చేసిన 33/11 కేవి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. వీపనగండ్ల నుంచి కేతేపల్లి వరకు రూ.30 కోట్లతో నిర్మించనున్న డబుల్ బీటీ రోడ్డుకు భూమిపూజ చేశారు. చిన్నంబావి మండలంలోని పెద్దదగడ నుంచి వెలగొండ వరకు.రూ.45.60 కోట్లతో, చిన్నంబావి నుంచి చెల్లపాడు వరకు రూ.39 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
కర్నెతండా లిఫ్టును ప్రారంభించిన మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి
రూ.87.53 కోట్లతో పనులు పూర్తి
దావాజిపల్లిలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం


