ఆ ఠాణాలో షరా‘మామూలే’! | - | Sakshi
Sakshi News home page

ఆ ఠాణాలో షరా‘మామూలే’!

Aug 25 2026 1:39 AM | Updated on Aug 25 2026 1:39 AM

ఫిర్యాదు తీసుకోవాలంటే ముడుపులేనా?

హెడ్‌కానిస్టేబుల్‌ తీరుపై ఆరోపణలు.. సీఐ కార్యాలయానికి అటాచ్‌

గతంలో ఇదే స్టేషన్‌లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ సస్పెన్షన్‌..

మళ్లీ చర్చనీయాంశంగా వసూళ్ల వ్యవహారం

అమరచింత: అమరచింత పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌ తీరుపై ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మహిళలతో అసభ్యంగా మాట్లాడినట్లు ఉన్న ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో హెడ్‌కానిస్టేబుల్‌ శాంతయ్యను సీఐ కార్యాలయానికి అటాచ్‌ చేసినట్లు సీఐ శివకుమార్‌ తెలిపారు. మరోవైపు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేసేవారని, డబ్బులు ఇచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చేవారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల విచారణతో అసలు వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

ఆడియో వైరల్‌.. అటాచ్‌

అమరచింత పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శాంతయ్య.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళతో ఫోన్‌లో మాట్లాడుతూ ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంలపై అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సీఐ శివకుమార్‌ను సంప్రదించగా.. సదరు హెడ్‌కానిస్టేబుల్‌ను సర్కిల్‌ కార్యాలయానికి అటాచ్‌ చేసి, విచారణ చేపట్టామని పేర్కొన్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఫిర్యాదుదారుల నుంచి డబ్బుల

వసూళ్ల ఆరోపణలు

స్టేషన్‌కు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ఫిర్యాదుదారుల వద్ద డబ్బులు డిమాండ్‌ చేసేవారని పలువురు ఆరోపిస్తున్నారు. మహిళా ఎస్‌ఐ ఉన్నప్పటికీ ఫిర్యాదుదారులను నేరుగా ఆమె వద్దకు పంపకుండా.. డబ్బులు ఇచ్చిన వారికే ప్రాధాన్యం కల్పించేవారని చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా పూర్తి స్థాయి విచారణ జరగాల్సి ఉంది.

అమరచింత పోలీస్‌స్టేషన్‌

గతంలోనూ ఇదే స్టేషన్‌లో..

గతేడాది జూలైలో నాగల్‌కడ్మూర్‌, ధర్మాపురం గ్రామాలకు చెందిన యువకులు క్రికెట్‌ ఆడుతున్న సమయంలో జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ కేసులో డబ్బులు తీసుకుని కొందరిని కేసు నుంచి తప్పిస్తామని అప్పటి ఎస్‌ఐ సురేష్‌ బేరసారాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. యువకులు ఎస్‌ఐ ఫోన్‌పేకు డబ్బులు పంపి, స్క్రీన్‌షాట్లను ఉన్నతాధికారులకు పంపినట్లు అప్పట్లో వెల్లడైంది. దీంతో ఎస్‌ఐ సురేష్‌తో పాటు ఏఎస్‌ఐ జమీరుద్దీన్‌ను సస్పెండ్‌ చేశారు.

మళ్లీ అదే స్టేషన్‌లో చర్చ..

గత ఘటన మరువకముందే తాజాగా హెడ్‌కానిస్టేబుల్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో అమరచింత పోలీస్‌స్టేషన్‌ మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుత ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement