అమరచింత: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు సీపీఎం ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పిట్టల రవి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై భారతదేశ రాజకీయ పరిస్థితులు, ప్రజ సమస్యలపై పోరాటాలు, కార్మిక, కర్షక ఉద్యమాల ప్రాధాన్యత, పార్టీ నిర్మాణం తదితర అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరిస్తున్నాయని.. సంక్షేమ పథకాలు పేదల దరి చేరడం లేదన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. స్థలం లేక నిర్మించుకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వితంతువులు చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. ఆరు గ్యారెంటీలతో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ త్వరలోనే ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి జీఎస్ గోపి, వెంకటేష్, ఆర్‌ఎన్ రమేష్, అజయ్, రాఘవేంద్ర, ఆత్మకూర్ మండల సీపీఎం కార్యదర్శి రాజు, గోపాల్, బుచ్చన్న, కౌన్సిలర్ మాధవి, కో–ఆప్షన్ సభ్యురాలు షాజహాన్, శ్రీను, చంటి తదితరులు పాల్గొన్నారు.


