వనపర్తిటౌన్: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ కోరారు. శనివారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ టోర్నీని ఆయన జ్యోతి వెలిగించి, జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడం చాలా ముఖ్యమని, ఏ రంగంలో ఆసక్తి ఉంటే అందులో ప్రతిభ చాటాలని సూచించారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసికోల్లాసం, ఏకాగ్రత పెంపొందుతాయన్నారు. జాతీయ క్రీడాకారుడు భాస్కర్‌గౌడ్, సీనియర్ క్రీడాకారుడు రవీందర్‌రెడ్డి ప్రోత్సాహంతో నిర్వహించిన పోటీలకు మహబూబ్‌నగర్ బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు పి.మన్మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి వెంకట్రామారెడ్డి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. మొదటిరోజు పోటీల్లో నిజామాబాద్ కరీంనగర్‌పై 35–29, 35–14 తేడాతో, రంగారెడ్డి ఖమ్మంపై 35–22, 35–14, వరంగల్ మహబూబ్‌నగర్‌పై 35–23, 35–10 తేడాతో విజయం సాధించాయి. మహిళా విభాగంలో మెదక్, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం ముందంజలో ఉన్నాయి. పురుషుల విభాగంలో రంగారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరాయని, మహిళా విభాగంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ జట్లు సెమీ ఫైనల్‌కు చేరే అవకాశాలు ఉన్నాయని డీవైఎస్‌ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి వి.వెంకటరమణ, సంయుక్త కార్యదర్శులు కమల్‌కుమార్, బి.శ్యామ్, తిరుపతి, నారాయణరెడ్డి, తాడిపర్తి సర్పంచ్ లోకారెడ్డి, చీఫ్ రెఫరీ రామకృష్ణారెడ్డి, ఎన్.కృష్ణారెడ్డి, టోర్నమెంట్ కమిటీ సభ్యులు ఈశ్వర్, వరప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.


