జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తే మరో ఉద్యమం తప్పదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి రవి హెచ్చరించారు. శుక్రవారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని.. కేకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ప్రక్రియను వేగవంతం చేసి, ఉద్యమకారులను గుర్తించాలన్నారు. మొదట్లో మూడు నెలల సమయం పెట్టి.. ఇప్పుడు కాలయాపన చేసేందుకు డిసెంబర్ వరకు కమిటీ టైం బాండ్ పెట్టడం ఉద్యమకారులను విస్మరించేందుకేనని అరోపించారు. ఉద్యమకారులుగా ఉన్న తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాడుతామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేదుకు సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లోని ఓయూలో ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి ఉద్యమకారులు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.


