వనపర్తిటౌన్: హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో ఈ నెల 7, 8 తేదీల్లో జరిగే 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి జావెలిన్ డే అథ్లెటిక్స్ మీట్– 2026కుగాను జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి నందిమళ్ల శ్రీకాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–6లో 60 మీటర్లు, స్టాండింగ్ లాంగ్‌జంప్, 150 మీటర్లు, అండర్–8లో 60 మీటర్లు, స్టాండింగ్ లాంగ్‌జంప్, 200 మీటర్లు, అండర్ –12లో 60 మీటర్లు, స్టాండింగ్ లాంగ్‌జంప్, 300 మీటర్లు, అండర్ –14లో కిడ్స్ జావెలిన్, అండర్–16, 18, 20, మెన్ అండ్ ఉమెన్ కేటగిరీలో జావెలిన్ త్రో ఎంపికలు నిర్వహిస్తామన్నారు. జిల్లాకేంద్రంలోని డా. బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో ఎంపికలు కొనసాగుతాయని.. ఉదయం 8 గంటలలోపు రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్‌నంబర్ 94413 53375 సంప్రదించాలని సూచించారు.
నేటి నుంచి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ
అమరచింత: ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రభుత్వం చౌకధర దుకాణాల్లో 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీకి శ్రీకారం చుట్టింది. శనివారం నుంచి లబ్ధిదారు ఒక్కరికి 6 కిలోల చొప్పున 3 నెలలకుగాను 18 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందుకుగాను జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు 8,600 మెట్రిక్ టన్నుల బియ్యం విడతల వారీగా సరఫరా చేయనున్నారు. 3 నెలల బియ్యం బస్తాలను నిల్వ చేసేందుకు స్థలం కొరత ఉందని రేషన్ డీలర్ల అభ్యర్థన మేరకు విడతల వారీగా సరఫరా చేయడానికి పౌరసరఫరాలశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. జిల్లాలో 1,83,568 రేషన్ కార్డులు ఉండగా ఇందులో తెల్ల రేషన్ కార్డులు 1,67,367, అంత్యోదయ కార్డులు 9,912, అన్నపూర్ణ కార్డులు 114 ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కొనసాగుతున్న
విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద భారీగా కొనసాగుతుండటంతో దిగువ, ఎగువ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోందని ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం ఎగువన 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 11.141 మి.యూ., దిగువన 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 11.86 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటి వరకు 12.327 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని.. ప్రస్తుతం 35 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని వివరించారు.


