వనపర్తి రూరల్: ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల సహకారంతో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులను నివారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం పెబ్బేర్‌లోని 7వ వార్డుతో పాటు మండలంలోని బునియాదిపూర్‌లో పర్యటించి ఫ్రైడే.. డ్రైడే కార్యక్రమ నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నివాస ప్రాంతాలను పరిశీలిస్తూ వర్షాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన ఆరోగ్య, పారిశుద్ధ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాల్లో పాత్రలు, కూలర్లు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఇతర వ్యర్థ వస్తువుల్లో నీటి నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, నివారణ మందులను పిచికారీ చేయడం, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చడం, పిచ్చి మొక్కలను తొలగించడం, మురుగు నిల్వకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలను వ్యాధి రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. బునియాదిపూర్‌లో అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణ, పారిశుద్ధ్య పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ వెంట పుర చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


