
కేఎల్‌ఐ.. రికార్డు బ్రేక్!
ప్రాజెక్టు ప్రారంభం నుంచి నీటి ఎత్తిపోతలు ఇలా..
ఈ ఏడాది ఇప్పటికే 4 టీఎంసీలు పంపింగ్
● గత సీజన్‌లో 50 టీఎంసీల నీటి ఎత్తిపోతలు
● మూడు మోటార్లతోనే కొనసాగుతున్న లిఫ్టింగ్
● భారం పడుతున్నా.. తప్పడం లేదంటున్న అధికారులు
కొల్లాపూర్: జిల్లా వరప్రదాయిని కేఎల్‌ఐ ప్రాజెక్టు నీటి ఎత్తిపోతల్లో రికార్డు సృష్టిస్తోంది. కృష్ణానదికి వరద ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే 4 టీఎంసీల నీటిని ఎత్తిపోసి గత రికార్డుకు బ్రేక్ వేసింది. 2011లో కేఎల్‌ఐ ద్వారా ఎత్తిపోతలు ప్రారంభం కాగా.. నాటి నుంచి అవిశ్రాంతంగా మోటార్లు పనిచేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం ప్రాజెక్టు మొదటి పంపుహౌజ్‌లో రెండు మోటార్లు పాడయ్యాయి. మిగిలిన మూడు మోటార్లతోనే నీటిని ఎత్తిపోస్తూ ప్రాజెక్టు అధికారులు రికార్డు సృష్టిస్తున్నారు.
పనితీరు ఇలా..
కేఎల్‌ఐ పరిధిలో ఎల్లూరు, జొన్నల బొగుడ, గుడిపల్లి గట్టు పంప్‌హౌజ్‌లు ఉన్నాయి. ఒక్కో పంపుహౌజ్‌లో 5 మోటార్ల చొప్పున ఏర్పాటుచేశారు. వీటిలో 4 మోటార్లు రెగ్యులర్ పంపింగ్ కోసం, ఒక మోటార్ స్పేర్‌లో ఉంచేందుకు నిర్ణయించారు. 30 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్కో మోటార్ ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. కేఎల్‌ఐ ద్వారా కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని ఆయకట్టు భూములకు సాగునీరు అందుతోంది.
మిషన్ భగీరథకు సైతం..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ పథకానికి కూడా కేఎల్‌ఐ ద్వారానే నీటి ఎత్తిపోతలు సాగుతున్నాయి. ఎల్లూరు సమీపంలోనే మిషన్ భగీరథ స్కీం ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచే అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ కోసం 7 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు.
మోటార్లపై భారం..
ఎల్లూరు పంప్‌హౌజ్‌లో ఐదు మోటార్లకు గాను ప్రస్తుతం మూడు మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయి. 2011లో కేఎల్‌ఐ ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంమైన సమయంలో ఐదు మోటార్ల ద్వారా 0.0086 టీఎంసీ నీటిని మాత్రమే ఎత్తిపోశారు. 2015 వరకు ప్రతి సంవత్సరం 2.5 టీఎంసీల లోపు మాత్రమే ఎత్తిపోతలు జరిగాయి. 2016 నుంచి నీటి పంపింగ్ శాతం భారీగా పెరుగుతూ వచ్చింది. మూడు మోటార్లతోనే రికార్డు స్థాయిలో పంపింగ్ జరుగుతోంది. సాగు, తాగునీటికి కేఎల్‌ఐ ప్రాజెక్టే దిక్కవడంతో మోటార్లపై పంపింగ్ భారం పెరుగుతోంది. నీటి పంపింగ్ రికార్డుస్థాయిలో జరుగుతోందని ఓవైపు ఆనందపడుతున్న అధికారులు.. మరో వైపు మోటార్లపై భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ ప్రాజెక్టు చరిత్ర..
కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని కోతిగుండు వద్ద నుంచి కృష్ణా బ్యాక్‌వాటర్‌ను వినియోగించుకునేలా కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించారు. 1998లో ప్రాజెక్టు నిర్మాణానికి సర్వే చేపట్టారు. 2003లో పనులు ప్రారంభమయ్యాయి. 2.50లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు 25 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా డిజైన్ రూపొందించారు. 2005లో ఆయకట్టు విస్తీర్ణాన్ని 3.40 లక్షలకు పెంచారు. 2011లో ఈ ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఎల్లూరు పంప్‌హౌజ్‌లోని 5 మోటార్ల ద్వారా రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు పంపింగ్ చేస్తున్నారు. 2016లో ప్రాజెక్టుకు 40 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. దీంతో ఆయకట్టు విస్తీర్ణాన్ని 4.24 లక్షల ఎకరాలకు పెంచారు.
రెగ్యులర్‌గా పంపింగ్..
వర్షాకాలంలో మినహాయిస్తే మిగతా రోజుల్లో ఎల్లూరు పంప్‌హౌజ్ లోని మూడు మోటార్ల ద్వారా రెగ్యులర్‌గా నీటిని పంపింగ్ చేస్తు న్నాం. సాగునీటితో పాటు, మిషన్ భగీరథకు కూడా నీటిని ఎత్తిపోస్తున్నాం. దీంతో మోటార్లపై భారం పడుతోంది. అయినా తప్పడం లేదు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపో తలు ప్రారంభమైతే కేఎల్‌ఐపై భారం తగ్గు తుంది. ఈ ఏడాది జూన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 4 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. గతేడాది 50 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం.
– లోకిలాల్ నాయక్,
డీఈ, పంపుహౌజ్ నిర్వహణ విభాగం
కేఎల్‌ఐ ఎత్తిపోతల పథకం
సీజన్ ఎత్తిపోసిన నీరు (టీఎంసీల్లో)
2011–12 0.00864
2012–13 1.9062432
2013–14 1.351552
2014–15 1.7842464
2015–16 2.5099632
2016–17 14.01715
2017–18 27.35148
2018–19 35.97796
2019–20 49.99874
2020–21 30.29203
2021–22 31.71288
2022–23 37.50358
2023–24 30.38209
2024–25 50.72208
2025 జూన్ 1నుంచి ఇప్పటి వరకు 4 టీఎంసీలు
ఎత్తిపోశారు.