
‘పోడు’ రైతుల ఆందోళన
పాన్‌గల్: తరతరాలుగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఏళ్లుగా అడుగుతున్నా పట్టించుకోకపోగా అటవీ అధికారులు భూములను అక్రమించి అక్రమ కేసులు నమోదు చేశారంటూ జిల్లాలోని పాన్‌గల్ మండలం కిష్టాపూర్‌తండా గిరిజన రైతులు ఆందోళన చేస్తున్నారు. వారి కథనం మేరకు.. గ్రామశివారులోని సర్వేనంబర్ 34లో 12 ఎకరాల పోడు భూమి ఉండగా సుమారు 50 ఏళ్లుగా 25 గిరిజన కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. పనికిరాని భూములను సైతం చదును చేసి యోగ్యంగా మలుచుకోవడంతో పాటు ఆయా భూముల్లో బోర్లు వేసుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. అట్టి భూములకు గతంలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన రెవెన్యూ అధికారులు ధరణి వచ్చిన తర్వాత కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదు. బీఆర్‌ఎస్ హయాంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గిరిజన రైతులకు పోడు పట్టాలిచ్చినా ఇక్కడి రైతులకు మాత్రం పంపిణీ చేయలేదు. కాగా కొందరు రైతులు బతుకుదెరువు కోసం భూములు వదిలి ముంబై, పూణే వంటి నగరాలకు వలస వెళ్లగా అటవీశాఖ అధికారులు వారికి తెలియకుండా మొక్కలు నాటి ఆక్రమించే చర్యలు పూనుకున్నారని రైతులు చెబుతున్నారు. దీంతో చేసేది లేక భూమిలో ఉన్న చెట్లను ధ్వంసం చేయడంతో ఈ నెల 5న అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 12 మంది గిరిజన రైతులపై కేసులు నమోదయ్యాయి. తమపై అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలంటూ రైతులు గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి సాగు చేసుకుంటున్న పోడు భూములపై సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని.. లేనిచో ఆత్మహత్యే శరణ్యమని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటవీశాఖ పరిధిలోని భూమిలో ఉన్న చెట్లను ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తిని ఆక్రమించే ప్రయత్నం చేయడంతో జిల్లా అధికారుల ఆదేశానుసారం గిరిజన రైతులపై కేసులు నమోదు చేశాం. రైతులు సాగు చేయని అటవీ భూముల్లో ఉపాధిహామీ పథకంలో నాటిన మొక్కలను కూడా తొలగించారు. వారి వద్ద ఉన్న ఆధారాలతో జిల్లా అధికారులను కలిసి భూములకు హద్దులు ఏర్పాటు చేసుకోవాలి. కానీ అటవీ భూమిలోని చెట్లను ధ్వంసం చేయడం, అక్రమించడం నేరమే అవుతుంది.
– బాలకిష్టమ్మ, డిప్యూటీ రేంజ్ అధికారి, ఖాసీంనగర్ సెక్షన్, వనపర్తి
ఓ పక్క ప్రభుత్వం సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెబుతుండగా.. మరోపక్క గిరిజన రైతులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదు. ఏళ్లుగా పంటలు సాగు చేసుకుంటున్న కిష్టాపూర్‌తండా గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలి. వారిపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలి. లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం.
– బాల్యానాయక్, జిల్లా కార్యదర్శి,
గిరిజన సంఘం, తెల్లరాళ్లపల్లితండా
తండా శివారులో ఉన్న పోడు భూమిని ఏళ్లుగా సాగుచేసుకుంటున్నాం. వీటికి సంబంధించి గతంలో రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాలు అందించారు. మేము కొంతకాలం పాటు వలస వెళ్తే అటవీ అధికారులు మొక్కలు నాటారు. వచ్చిన తర్వాత పెరిగిన చెట్లను ధ్వంసం చేయడంతో కేసులు నమోదు చేశారు. జైలుకై నా వెళ్తాం.. కానీ సాగుచేసిన భూములను వదులుకోం. – మంగమ్మ,
మహిళా రైతు, కిష్టాపూర్‌తండా
మేము ఎన్నో సంవత్సరాల క్రితం బీడు భూములను మంచిగా చేసి సాగుకు అనువుగా మార్చుకున్నాం. అందులో బోర్లు కూడా వేసుకున్నాం. మాకు ఈ భూమి తప్ప వేరే భూమి లేదు, ఇదే అధారం. కొంత కాలం పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళితే అందులో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటి అవి అటవీశాఖకు చెందినవిగా చిత్రీకరిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. భూమి దక్కే వరకు పోరాడుతాం.
– బొజ్జమ్మ,
మహిళా రైతు, కిష్టాపూర్‌తండా
సాగు భూమిని లాక్కున్నారని పోరుబాట
అటవీశాఖ స్థలంలో చెట్లు
తొలగించారని కేసుల నమోదు
పాన్‌గల్ మండలం
కిష్టాపూర్‌తండాలో ఘటన
విచారణ జరిపి
న్యాయం చేయాలని వేడుకోలు