
నులి పురుగును నిర్మూలిద్దాం
● జిల్లాలో నేడు, 18 తేదీల్లో
ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
● ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్య, ఆరోగ్యశాఖ
పాన్‌గల్: ఆరోగ్య సమాజ నిర్మాణానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కడుపులో నులి పురుగులు ఉండటంతో పిల్లలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. వీటి నివారణే లక్ష్యంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధమైంది. ఏటా ఫిబ్రవరి 10న మొదటి విడత, ఆగస్టు 10న రెండో విడత ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ ఏడాది నిర్వహించాల్సిన మాత్రల పంపిణీ కార్యక్రమం వివిధ కారణాలతో వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ నెల 11, 18 తేదీల్లో ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. ఈ మేరకు అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతో పాటు బయట ఉండే 1 నుంచి 19 ఏళ్లలోపు వారిని ఇప్పటికే గుర్తించారు.
వ్యాధి లక్షణాలు..
నులి పురుగులున్న పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, అతిసారం, మలంలో రక్తం పడటం, వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
సరియైన సమయంలో చికిత్స.....
పురుగుల పునరుత్పత్తి, ఎదుగుదల మొత్తం కడుపులోనే జరగడంతో మనం తీసుకునే ఆహారాన్ని అవే లాగేసుకుంటాయి. దీని ఫలితంగా పదేళ్ల వయసున్న వారిలో ఎక్కువగా రక్తహీనత, ఆకలి లేకపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. సరైన సమయంలో గుర్తించి వెంటనే వైద్యుడిని సంప్రదించి చి కిత్స చేయించుకోవాలి. ఆల్బెండజోల్ మాత్రలను ఏటా రెండు పర్యాయాలు వేయించడంతో నులి పు రుగుల సమస్యను నివారించే అవకాశం ఉంటుంది.
మాత్రల మోతాదు..
రెండేళ్లలోపు పిల్లలకు ఆర మాత్ర (200 ఎంజీ), 2 నుంచి 3 ఏళ్లలోపు వారికి ఒక మాత్ర (400 ఎంజీ) పొడి రూపంలో అందించాలి. 3 నుంచి 19 ఏళ్లలోపు వారికి ఒక మాత్ర (400 ఎంజీ) చప్పరించాలి. ప్రతి ఆరు నెలలకు ఓసారి ఈ మాత్ర వేసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. ఏదేని కారణంతో 11వ తేదీన మాత్ర వేసుకోని వారు 18వ తేదీన వేసుకునే అవకాశం కల్పించారు. అపోహలు వద్దు ..
ఆల్బెండజోల్ మాత్రలతో ఎలాంటి దుష్పరిణామాలు, అపోహలు అవసరం లేదు. 19 ఏళ్లలోపు వారంతా మాత్రలు వేసుకునేలా ప్రోత్సహించాలి. మాత్రల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 100 శాతం పంపిణీకి కృషి చేస్తున్నాం. మధ్యాహ్న భోజనం తర్వాత మాత్ర వేసుకొని గంటపాటు నీరు తాగకుండా ఉండాలి. వైద్యసిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమన్వయంతో పూర్తి చేస్తాం. మాత్రల వినియోగం, చేతుల శుభ్రత, ఆరుబయట మల, మూత్ర విసర్జన తదితర అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నాం.
– డా. పరిమళ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి
మాత్రల పంపిణీ విధులు నిర్వర్తించే సిబ్బంది
సూపర్‌వైజర్లు 36
ఏఎన్‌ఎంలు 154
అంగన్‌వాడీ టీచర్లు 577
ఆశా కార్యకర్తలు 559