
ప్రతిభను గుర్తించి వెలికితీయాలి
వనపర్తి: జిల్లాలో విభిన్న రంగాల్లో ప్రతిభ సాధించిన కళాకారులు ఎందరో ఉన్నారని.. అలాంటి వారు వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి శిల్పకళా రంగంలో ప్రతిభా పురస్కారం అందుకున్న జిల్లాకు చెందిన శిల్పి బైరోజు చంద్రశేఖర్‌ను ఎస్పీ ఘనంగా సన్మానించి మాట్లాడారు. వంశపారంపర్యంగా వస్తున్న శిల్పకళను చంద్రశేఖర్ చిన్ననాటి నుంచి నేర్చుకొని ఎన్నో ఆలయాలకు వందలాది విగ్రహాలు తయారు చేయడం అభినందనీయమన్నారు. శిల్పిగా, సాహితీవేత్తగా, పరిశోధకుడిగా బహుముఖ ప్రతిభకనబర్చిన బైరోజు మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, వనపర్తి జిల్లా విశ్వకర్మ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మారోజు తిరుపతయ్య, బి.యాదగిరి పాల్గొన్నారు.
● ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తిచేసి ఆరు బంగారు పతకాలు సాధించిన జిల్లాకేంద్రానికి చెందిన గుండోజు భార్గవిని ఎస్పీ రావుల గిరిధర్ మంగళవారం తన కార్యాలయంలో సన్మానించి అభినందించారు. చదువులో రాణించి పలువురికి స్ఫూర్తిగా నిలిచిన భార్గవితో ఎస్పీ మాట్లాడి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. తండ్రి యాదగిరి ఆచారి స్వర్ణకార వృత్తి చేస్తూ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు.

ప్రతిభను గుర్తించి వెలికితీయాలి