
కలెక్టర్ యాదయ్య సమక్షంలో లక్కీ డ్రా
వనపర్తి: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట, రామంతపూర్)లో 2025–26 విద్యాసంవత్సరం ఒకటో తరగతిలో ప్రవేశాలకుగాను గిరిజన బాల, బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరించగా మంగళవారం కలెక్టరేట్‌లో ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. మూడు బాలుర, 3 బాలికలకుగాను బాలుర నుంచి 5 దరఖాస్తులు రాగా ముగ్గురిని పారదర్శకంగా ఎంపిక చేసినట్లు జిల్లా గిరిజన, సంక్షేమ అభివృద్ధిశాఖ అధికారి తెలిపారు. కార్యక్రమంలో డీటీడీఓ సభ్యురాలు ఉమాదేవి, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కవిత, గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
‘పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్’
వనపర్తి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారీ దవాఖానాలపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండటంతో వైద్యసేవలు అరకొరగా అందుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని టీ–హబ్, క్రిటికల్ కేర్ సెంటర్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇక్కడి టీ హబ్ డయాగ్నోస్టిక్ సెంటర్ సేవలందించడంలో రాష్ట్రంలోనే రెండోస్థానం ఉండేదని.. ప్రస్తుతం 12వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. 134 రకాల వైద్య పరీక్షలు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 95 మాత్రమే నిర్వహిస్తున్నారని, వైద్యులు లేక హృద్రోగులను పరీక్షించే 2డి ఎకో యంత్రం వృథాగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఉందని, రేడియాలజిస్ట్ సైతం అందుబాటులో లేకపోవటం శోచనీయమన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్త పరీక్షలకు వాడే రీ ఏజెంట్స్ లేక నాగర్‌కర్నూల్ నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. గర్భిణులకు మూడు రకాల థైరాయిడ్ పరీక్షలు చేయాల్సి ఉండగా.. యంత్రం మరమ్మతులో ఉందని పరీక్షలు చేయడం లేదన్నారు. అన్నిరకాల వైద్యపరీక్షలు, రేడియాలజిస్ట్, కార్డియాలజిస్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని.. సమస్యలపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రికి లేఖ రాస్తామని చెప్పారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, నాయకులు రమేష్‌గౌడ్, నందిమళ్ల అశోక్, గంధం పరంజ్యోతి, విజయ్‌కుమార్, ఉంగ్లం తిరుమల్, నాగన్న యాదవ్, హేమంత్ ముదిరాజ్, చిట్యాల రాము పాల్గొన్నారు.
విద్యార్థులు క్రీడల్లోనూ ప్రతిభ చాటాలి
వనపర్తిటౌన్: విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లోనూ ప్రతిభ చాటాలని వనపర్తి జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్‌వీఎస్ రాజు అన్నారు. కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న చరణ్‌కుమార్ ఈ నెల 3, 4 తేదీల్లో హన్మకొండలో జరిగిన తెలంగాణ 11వ జూనియర్, సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని బంగారు, రజత పతకం సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో ప్రిన్సిపాల్ చరణ్‌కుమార్‌కు పూల మొక్క అందజేసి అభినందించారు. ట్రిపుల్ జంప్‌లో 13.14 మీటర్లు దూకి బంగారు, లాంగ్ జంప్‌లో 6.40 మీటర్లు దూకి రజత పతకం సాధించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బీవీ రాం నరేష్ యాదవ్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
రైతుబీమా దరఖాస్తునకు నేడు చివరి గడువు
కొత్తకోట రూరల్: రైతుబీమాకు 18 నుంచి 59 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని, బుధవారంతో గడువు ముగియనుందని.. సద్వినియోగం చేసుకోవాలని కొత్తకోట ఏడీఏ దామోదర్ కోరారు. క్లస్టర్ పరిధిలోని రైతులు సంబంధిత ఏఈఓలను కలిసి పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, నామిని ఆధార్‌కార్డు జిరాక్స్‌ను దరఖాస్తునకు జతచేసి అందజేయాలని సూచించారు.