భూములు కోల్పోయి.. మోసపోయి.. గుండె పగిలిపోయి.. | - | Sakshi
Sakshi News home page

భూములు కోల్పోయి.. మోసపోయి.. గుండె పగిలిపోయి..

Aug 12 2025 7:37 AM | Updated on Aug 12 2025 12:41 PM

భూముల

భూములు కోల్పోయి.. మోసపోయి.. గుండె పగిలిపోయి..

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఆరుగాలం కష్టించి జీవనోపాధి పొందుతున్న వ్యవసాయ భూములతో పాటు ఉంటున్న ఇళ్లు, జ్ఞాపకాలన్నీ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ నిర్మాణంలో పోయాయి. ఆ తర్వాత వచ్చిన అరకొర పరిహారంతోనైనా కుటుంబ పరిస్థితులు చక్కదిద్దుకోవాలన్న వారి ఆశలను బోగస్‌ ఫైనాన్స్‌ కంపెనీ గండి కొట్టింది. అధిక వడ్డీ చెల్లిస్తామనే పేరిట నిర్వాసితుల నుంచి భారీగా డబ్బులు సేకరించి.. చివరకు బోర్డు తిప్పేసింది. ఈ క్రమంలో రైతులు అంతకుముందు నుంచే అంటే నాలుగేళ్లుగా వారి చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురై అనారోగ్యం పాలవుతున్నారు. బాధితుల్లో ఇప్పటివరకు పలువురు ఆత్మహత్య చేసుకోగా.. హార్ట్‌ అటాక్‌తో సుమారు 20 మంది.. కిడ్నీ ఇతర ఆరోగ్య కారణాలతో మరో 120 మంది వరకు మృత్యు కౌగిలికి చేరారు. ఇంకా కొందరు చికిత్సకు డబ్బులు లేక మరణశయ్యపై కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌..

14 మందిపై కేసు.. రూ.50 కోట్ల ఆస్తి జప్తు

డిపాజిట్ల అనంతరం కొన్ని రోజుల తర్వాత ఫైనాన్స్‌ నిర్వాహకులు సక్రమంగా వడ్డీ చెల్లించకపోవడంతో నిర్వాసితులు నాగర్‌కర్నూల్‌ మార్కెట్‌ సెంటర్‌లోని ఫైనాన్స్‌ కార్యాలయం వద్దకు క్యూకట్టారు. ఇలా 2020 నుంచి 2023 వరకు చక్కర్లు కొట్టారు. అప్పుడు, ఇప్పుడు అంటూ ఫైనాన్స్‌ నిర్వాహకుడు సాయిబాబు, అతడి కుటుంబ సభ్యులు మాయమాటలు చెబుతూ చివరకు కంపెనీని ఎత్తివేశారు. దీంతో 2023 ఫిబ్రవరి 13న బాధితులు నాగర్‌కర్నూల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. ఇందులో ఇత్యాల సాయిబాబు (ఏ–1)తో పాటు ధనుంజయ్‌ (ఏ–2), బాలేశ్వర్‌ (ఏ–3), ఇత్యాల రజిత (ఏ–4), యామిని (ఏ–5), శారద (ఏ–6), సాయిదివ్య (ఏ–7), సాయి దీక్షిత్‌ (ఏ–8) అనుపటి శ్రీనివాసులు, తాడూరు మాజీ సర్పంచ్‌(ఏ–9), ఆర్‌అండ్‌ఆర్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న నాగం బుచ్చిరెడ్డి అలియాస్‌ సురేందర్‌రెడ్డి (ఏ–10), జానకీ రాంరెడ్డి (ఏ–11), కరుణాకర్‌రెడ్డి (ఏ–12), గువ్వ వెంకటేశ్వర్లు (ఏ–13), ఉర్సు హుస్సేన్‌ (ఏ–14)పై కేసు నమోదైంది. వీరిలో సాయిబాబు, సాయిదీక్షిత్‌, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, హుస్సేన్‌ను అరెస్ట్‌ చేశారు. మిగిలిన వారు ముందస్తు బెయిల్‌ పొందారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సాయిబాబు కుటుంబసభ్యుల ఆస్తులను జప్తు చేయాలని.. ఈ ఏడాది జూన్‌ 17న జీఓ నంబర్‌ 562ను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ మార్కెట్‌ వాల్యు ప్రకారం ఇప్పటివరకు సదరు ఫైనాన్స్‌ కంపెనీ నిర్వాహకులకు సంబంధించి రూ.50 కోట్ల ఆస్తిని జప్తు చేశారు.

2 వేల మంది.. సుమారు రూ.180 కోట్ల డిపాజిట్‌

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపునకు గురవుతున్న ప్రజలకు సంబంధించి గత ప్రభుత్వం పరిహారం అందజేసింది. నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో సుమారు 50 గ్రామాలు ముంపునకు గురి కాగా.. నిర్వాసితులకు సంబంధించి ఎకరా పట్టా భూమికి రూ.5.50 లక్షలు, లావణి పట్టా భూమికి రూ.3.50 లక్షలు.. ఇల్లు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ.12.50లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసింది. అయితే ముంపు గ్రామమైన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్‌కు చెందిన సాయిబాబా తన కుటుంబసభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్‌ మార్కెట్‌ యార్డు సమీపంలో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్‌ పేరుతో 1995 నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్‌ ఫైనాన్స్‌ను నడిపిస్తున్నాడు. మొదట రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీల వ్యాపారం చేసి నమ్మకం కలిగించాడు. ఈ క్రమంలో రైతులకు ఒక్కసారిగా వచ్చిన నష్ట పరిహారంపై అతడి కన్ను పడింది. రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్త్తామని.. మీరు భూములు, ప్లాట్లు కొన్నప్పుడు 15 రోజుల ముందు చెబితే మీ డబ్బులు మీకు ఇస్తామని నమ్మబలికి 2018 నుంచి 2020 వరకు డిపాజిట్‌ చేయించుకున్నాడు. తొలుత వడ్డీ సక్రమంగా చెల్లిస్తూ రాగా.. సుమారు 2,500 మంది దాదాపు రూ.150 నుంచి రూ.180 కోట్ల వరకు సదరు ఫైనాన్స్‌ కంపెనీలో నిర్వాసితులు పరిహారం డబ్బులను జమ చేశారు.

ఒక్కొక్కరుగా ‘పాలమూరు–రంగారెడ్డి’ నిర్వాసితుల మృత్యువాత

వడ్డీ ఆశతో వచ్చిన పరిహారం డబ్బులుఓం శ్రీసాయిరాం ఫైనాన్స్‌లో జమ

వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో సుమారు 2,500 మంది బాధితులు

రూ.180 కోట్ల మేర కంపెనీలో డిపాజిట్‌.. బోర్డు తిప్పేయడంతో రైతుల గగ్గోలు

మోసంతో చితికిన కుటుంబాలు.. అనారోగ్యంతో మంచం పాలు

ఇప్పటికే ఒకరు ఆత్మహత్య.. హార్ట్‌ ఎటాక్‌తో 20 మంది వరకు మృతి

వివిధ ఆరోగ్య కారణాలతో మరో 120 మంది కూడా..

భూములు కోల్పోయి.. మోసపోయి.. గుండె పగిలిపోయి..1
1/3

భూములు కోల్పోయి.. మోసపోయి.. గుండె పగిలిపోయి..

భూములు కోల్పోయి.. మోసపోయి.. గుండె పగిలిపోయి..2
2/3

భూములు కోల్పోయి.. మోసపోయి.. గుండె పగిలిపోయి..

భూములు కోల్పోయి.. మోసపోయి.. గుండె పగిలిపోయి..3
3/3

భూములు కోల్పోయి.. మోసపోయి.. గుండె పగిలిపోయి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement