
కోతలే కోతలు!
●
చీటికీ మాటికి విద్యుత్ సరఫరాలో అంతరాయం
● కనీస సమాచారం లేకుండా కోతలు విధిస్తున్న వైనం
● ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు
ఇబ్బందులు పడుతున్నాం..
గ్రామాలతో పాటు పట్టణాల్లో ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో పనులకు ఆటంకం కలుగుతుంది. విద్యుత్‌పై ఆధారపడి జీవనం సాగించే వారు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సమస్య లేకుండా చూడాలి.
– రవి, మోటారు మెకానిక్, కొత్తకోట
చెట్లకొమ్మల తొలగింపుతోనే..
విద్యుత్ లైన్ల కింద ఏపుగా పెరిగే చెట్ల కొమ్మల తొలగింపు పనులను ఎప్పటికప్పుడు చేపడుతున్నాం. ఈ క్రమంలోనే ఆయా ఫీడర్ల పరిధిలో అవసరం మేరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటాం. దీనికి తోడు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సమస్యలు తలెత్తినప్పుడు, ఎక్కడైనా విద్యుత్ ట్రిప్ అయినప్పుడు మాత్రమే సరఫరాను నిలిపివేస్తాం. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నాం.
– రాజశేఖరం, విద్యుత్ ఎస్‌ఈ
వనపర్తిటౌన్: జిల్లాలో అధికారిక విద్యుత్ కోతలు అధికమవుతున్నాయి. చీటికీ మాటికి విద్యుత్ సరఫరాలో అధికారికంగా కోతలు విధిస్తున్నారు. జిల్లాలో 33కేవీ పరిధిలో 29 ఫీడర్లు, 11కేవీ పరిధిలో 241 ఫీడర్లు ఉన్నాయి. గత ఏప్రిల్ నుంచి జూలై 31 వరకు మొత్తం 270 ఫీడర్ల పరిధిలో అధికారికంగా 2,839 గంటలు కోత విధించారు. దీంతో సగటున ఒక్కొక్క ఫీడర్ పరిధిలో సగటున 10.51 గంటల పాటు విద్యుత్ సరఫరాలో కోత పెట్టారు. 11 కేవీ ఫీడర్ల కింద అత్యధికంగా 2,141.32 గంటలు, 33 కేవీ ఫీడర్ల పరిధిలో 698.39 గంటలు విద్యుత్ కోతలు విధించినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన జూన్, జూలైలో వేసవికి పోటీగా 3నుంచి 5గంటల తేడాతో విద్యుత్ అంతరాయం ఏర్పడటం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో 220కేవీ, 132/33కేవీ సబ్‌స్టేషన్లు ప్రధానమైనవి. 33కేవీ ఒక్కొక్కఫీడర్ పరిధిలో 2 నుంచి 4 సబ్‌స్టేషన్లు ఉన్నాయి. 11కేవీ పరిధిలోని 241 ఫీడర్ల ద్వారా అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. అయితే ప్రధాన సబ్‌స్టేషన్ నుంచి 33కేవీ ఫీడర్లకు విద్యుత్ సరఫరా సమయంలో అప్పుడప్పుడు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క ఫీడర్ పరిధిలో ఒక్కోలా విద్యుత్ కోతలు నమోదవుతున్నాయి.
● జిల్లాలోని 11కేవీ సబ్‌స్టేషన్ల నుంచి 241 ఫీడర్ల ద్వారా వ్యవసాయం, గృహ, ఇతర అవసరాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఒక్కొక్క ఫీడర్ పరిధిలో వ్యవసాయ, సాధారణ ట్రాన్స్‌ఫార్మర్లు 50 నుంచి 100 వరకు ఉంటాయి. అయితే వీటి పరిధిలో సాధారణంగా వేసవిలో అధికంగా విద్యుత్ కోతలు ఉంటాయి. అయితే అందుకు భిన్నంగా వర్షాకాలం ప్రారంభమైన జూన్, జూలై నెలల్లోనూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఏప్రిల్‌లో 545.30 గంటల పాటు విద్యుత్ కోతలు విధించగా.. గతనెల (జూలై)లో 534.56 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం విస్మయం కలిగిస్తుంది. మేలో 532.28 గంటలు కాగా.. జూన్‌లో 529.18 గంటల విద్యుత్ కోత విధించారు.
జిల్లా కేంద్రంలో విద్యుత్ సరఫరా లేక నెలకొన్న అంధకారం
ఫీడర్ పేరు ఫీడర్ల సంఖ్య ఏప్రిల్ మే జూన్ జూలై
33కేవీ 29 182.48 174.25 169.42 172.24
11కేవీ 241 545.30 532.28 529.18 534.56

కోతలే కోతలు!

కోతలే కోతలు!