
క్రీడారంగానికి ఉజ్వల భవిష్యత్
ఆత్మకూర్/అమరచింత: రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను తీర్చుదిద్దుతున్నామని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందించామని రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం అమరచింత జెడ్పీ పాఠశాల ఆవరణలో ఇండోర్ స్టేడియం, మినీ స్టేడియం నిర్మాణాలకు శాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సోనిబాల దేవి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి స్థల పరిశీలన చేశారు. 4 తరగతి గదులను తొలగించి వాటి స్థానంలో ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు పట్టణ ప్రజలు సహకరించాలన్నారు. అలాగే పాఠశాలకు 4 అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పీఆర్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆత్మకూర్‌లో మినీ స్టేడియాన్ని సందర్శించి ఈ నెల 25న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంపు వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత పాలకులు పదేళ్ల పాటు క్రీడారంగాన్ని పూర్తిగా విస్మరించారని, ప్రస్తుత ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఆత్మకూర్‌లో రూ.5 కోట్లు, అమరచింతలో రూ.2 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇండోర్ స్టేడియం, మినీ స్టేడియం, షటిల్, కబడ్డీ క్రీడాకారులతో పాటు వాకర్స్‌కు సకల సౌకర్యాలు కల్పించేందుకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసి ప్రతిపాదనలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని.. అందులో భాగంగానే పట్టణంలోని సమ్మిళిత ఫౌండేషన్ అంధ విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు రూ.4.80 లక్షలు అందించామని వెల్లడించారు. జూరాల గ్రామం వద్ద రూ.122 కోట్లతో వంతెన నిర్మిస్తామని.. ఆత్మకూర్‌లో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధిస్తామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఘాటుగా సమాధానం ఇవ్వాలని కాంగ్రేస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
అంతర్జాతీయ క్రీడాకారులను అందిస్తాం..
నూతన క్రీడా విధానంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ బాధ్యతలు మరింత విస్తరించబోతున్నాయని, రాష్ట్రం నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని శాట్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. సీఎం ఆదేశాలతో వివిధ శాఖల సమన్వయంతో విస్తృతంగా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని, శాట్ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, రానున్న రోజుల్లో రెట్టింపు స్థాయిలో చేపడతామని వెల్లడించారు. అమరచింతలో జరిగిన కార్యక్రమంలో డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్‌ఖాన్, మార్కెట్ డైరెక్టర్లు శ్యాం, పోసిరిగారి విష్ణు, డి.మోహన్, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు మహేందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, తౌఫిక్, హన్మంతు నాయక్, మాజీ ఎంపీటీసీ మహంకాళి విష్ణు, ఆత్మకూర్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి సుధీర్‌కుమార్‌రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ రహ్మతుల్లా, నాయకులు గంగాధర్‌గౌడ్, పరమేష్, నల్గొండ శ్రీను, తులసిరాజ్, మశ్ఛందర్‌గౌడ్, నాగేష్, అజ్మతుల్లా, షాలం, రఫీఖ్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు
రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి