
చెరువులకు జలకళ
భూత్పూర్ రిజర్వాయర్ కాల్వకు నీటి విడుదల
●
ఆయకట్టుకు సాగునీటి
సరఫరా..
రిజర్వాయర్ పరిధిలోని 22,700 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. కాల్వలో పూడికతీత, ముళ్లపొదల తొలగింపు ఉపాధిహామీ పనుల్లో చేపట్టాం. మరికొన్ని చోట్ల దేశాయి ప్రకాష్‌రెడ్డి సహకారంతో పూడిక తొలగింపు పనులు చేపట్టడంతో ప్రస్తుతం నీరు చెరువులకు చేరుతోంది.
– సతీష్‌కుమార్,
డీఈ, భూత్పూర్ రిజర్వాయర్
అమరచింత: భూత్పూర్ రిజర్వాయర్ ప్రధాన ఎడమ కాల్వ ద్వారా అమరచింత, ఆత్మకూర్, నర్వ మండలాలతో పాటు మక్తల్ మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందిస్తున్నారు. నెలరోజులుగా కాల్వకు నీటిని వదులుతుండటంతో ఆయా గ్రామాల్లోని రైతులు తమ పొలాలకు నీటిని మళ్లించుకొని పంటలు సాగు చేస్తుండటంతో పాటు 28 చెరువులు నీటితో నింపారు. దీంతో ఆయా చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు సైతం సాగునీరు అందించేందుకు భూత్పూర్ రిజర్వాయర్ అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కాల్వ పరిధిలోని ఆయా మండలాల్లో 22,700 ఎకరాల ఆయకట్టులో ఈసారి వానాకాలం వరితో పాటు ఆరుతడి పంటలైన పత్తి, ఆముదం, కంది తదితర పంటలు సైతం సాగుచేస్తున్నారు. అలాగే ఆయకట్టు రైతులు కాల్వ వెంట ఉన్న డిస్ట్రిబ్యూటరీల మరమ్మతుతో పాటు ముళ్లపొదలు, పూడికతీత పనులు సైతం చేపడుతూ నీటిని తమ పొలాలకు తరలించుకుపోతున్నారు. 32 కిలోమీటర్ల పొడవున్న కాల్వకు లైనింగ్ చేపట్టినా అంచుల వెంట ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో నీటిపారుదలశాఖ అధికారులు వేసవిలో జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా తొలగిచడంతో వానకాలంలో కాల్వలో నీటిని పొందగలుగుతున్నారు.
దాత సహకారంతో..
రిజర్వాయర్ ఎడమ కాల్వలో ఈసారి భారీగా మట్టి పేరుకుపోవడం, ముళ్ల పొదలు ఏపుగా పెరగడంతో నీరు ముందుకు పారడం లేదని ఆయా గ్రామాల రైతులు నీటిపారుదలశాఖ అధికారులకు విన్నవించారు. వారు స్పందించకపోవడంతో నాగిరెడ్డిపల్లి, పాంరెడ్డిపల్లి, మస్తీపురం, పిన్నంచర్ల, అమరచింత రైతులు మాజీ అడ్వొకేట్ జనరల్ దేశాయి ప్రకాష్‌రెడ్డిని కలిసి సాగునీటి కష్టాలను వివరించారు. కాల్వ పూడికతీతకు అవసరమైన ఖర్చు స్వయంగా భరిస్తానని అధికారులకు హామీ ఇవ్వడంతో యుద్ధప్రాతిపదికన పూడికతీత, ముళ్లపొదల తొలగింపు పనులు చేపట్టారు. ప్రస్తుతం కాల్వ ద్వారా ఆయా గ్రామాల చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
32.2 కిలోమీటర్ల పొడవున
విస్తరించిన కాల్వ
నిండుకుండను తలపిస్తున్న
28 చెరువులు
మూడు మండలాలు..
22,700 ఎకరాల ఆయకట్టు

చెరువులకు జలకళ

చెరువులకు జలకళ