
బుద్దారం చరిత్ర గొప్పది
గోపాల్‌పేట: మండలంలోని బుద్దారం గ్రామానికి గొప్ప చరిత్ర ఉందని.. ఎప్పుడు ఎలా ఏర్పడింది, అలాగే గండి ఆంజనేయస్వామి ఆలయ చరిత్ర తదితర వివరాలను పుస్తక రూపంలోకి మార్చడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం గ్రామంలో విశ్వవాణి గ్రామాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో బుద్ధారం చరిత్ర–సంస్కృతి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వారి వారి చరిత్ర తెలుసుకోవడంతో ఏం సాధించాం.. ఇంకా ఏం సాధించాలనే అవగాహన కలుగుతుందని తెలిపారు. గ్రామ చరిత్రను పుస్తక రూపంలోకి మార్చిన రచయిత రమేష్‌బాబును, అలాగే గ్రామానికి చెందిన డా. లగిశెట్టి శ్రీనివాసులు ఎనిమిది డిగ్రీలు పూర్తిచేసినందుకుగాను అభినందించారు. జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, సంఘం అధ్యక్షుడు పూల్యానాయక్, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్, అచ్యుతరామారావు, ఓంకార్, శివకుమార్, శేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.