
వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురికావొద్దు
వనపర్తి: వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా జిల్లాలోని అన్ని పురపాలికల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి జిల్లాలోని అన్ని పురపాలికల కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనావాసాలకు ఇబ్బందులు కలిగించే పెద్ద డ్రైనేజీల జాబితా సిద్ధం చేసి బాగు చేయించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ నెలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని.. జిల్లాకేంద్రంలో మూడు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులు, గుంతలను పూడ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా తాగునీటి స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని.. ట్యాంకులను శుభ్రం చేయించాలని సూచించారు. ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టి కాలనీలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలని, అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్లెక్సీల ఏర్పాటును కట్టడి చేయాల్సిన అవసరం ఉందని.. ఏర్పాటు చేసిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో తొలగించాలన్నారు. వనపర్తి పుర పరిధిలోని శ్రీనివాసపురం వద్ద కొత్తగా ఏర్పాటు చేయనున్న వెంచర్ లేఅవుట్ డ్రాఫ్ట్ ఆమోదానికి గూగుల్ మ్యాప్‌లో పరిశీలించారు. ఎలాంటి సమస్యలు లేవని అధికారులు తెలుపడంతో ఆమోదం తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజినీర్ మల్లయ్య, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్‌రెడి పాల్గొన్నారు.