వనపర్తి రూరల్: శ్రావణ మాసం నాల్గో శుక్రవారం సందర్భంగా పెబ్బేరు పట్టణంలోని శ్రీ వాసవీ కన్యాకాపరమేశక్వరి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆలయ అర్చకులు కిట్టుస్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, మహామంగళ హారతి నీరాజన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారు 180 పసుపు రంగు చీరల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం అమ్మవారి ఆలయంలో లలితాసహస్ర పారాయణం, కుంకుమార్చన, పల్లకీసేవా తదితర పూజలు చేశారు.
‘ఓట్లు చోరీ చేసి నీతులు చెప్పడం హాస్యాస్పదం’
అమరచింత: ఓట్లు చోరీ చేస్తూ గద్దెనెక్కాలనుకున్న బీజేపీ ఇతర పార్టీలను విమర్శించడం ఎంత వరకు సమంజసమని డీసీసీ ప్రధాన కార్యదర్శి ఆయూబ్‌ఖాన్ ప్రశ్నించారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఓట్‌కి చోర్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంలను అడ్డుపెట్టుకొని కేంద్రంలో మూడు పర్యాయాలు అధికారంలోకి వచ్చారని బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీహార్‌లో ఓట్ల చోరీ జరిగిందని ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని లక్షలాది ఓట్లను తొలగించడమే ఇందుకు నిదర్శనమన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్న మంత్రి వాకిటి శ్రీహరిపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడం తగదన్నారు. పూటకో రాజకీయ పార్టీలో చేరుతూ ప్రజా సమస్యలను గాలికొదిలిన బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మడం మానుకోవాలని హితువు పలికారు. అమరచింత పట్టణంలో రూ.13 కోట్లతో ఎంపీ డీకే అరుణ తాగునీటి పథకాన్ని తీసుకొచ్చారని చెప్పిన నాయకులు వీటిలో 40 శాతం నిధులు రాష్ట్రానివి అన్న విషయం మరిచిపోవడం హస్యాస్పదంగా ఉందన్నారు. సమావేశంలో మార్కెట్ డైరెక్టర్లు పోసిరిగారి విష్ణు, శ్యాం, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు మహేందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, తౌఫిక్, ప్రకాశం, హనుమంతునాయక్, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.