
ఆగని అక్రమ దందా?!
వనపర్తి: జిల్లాలో వరి ధాన్యం అక్రమ దందా ఆగడం లేదు. పౌరసరఫరాలశాఖ అధికారుల నామమాత్రపు పర్యవేక్షణతో కొందరు మిల్లర్లు ఇష్టారీతిన సీఎంఆర్ కోసం ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా జిల్లాకేంద్రంలోని ఓ మిల్లర్ ప్రభుత్వ అందించిన సంచుల్లోనే పెద్దమొత్తంలో ధాన్యాన్ని కర్ణాటకకు తరలిస్తుండగా పెబ్బేరులో సీసీఎస్ అధికారులు దారికాచి పట్టుకున్నారు. ఈ ఘటనతో జిల్లా అధికార వర్గం దృష్టి ఒక్కసారిగా సీఎంఆర్ దందా వైపు మళ్లినట్లయింది.
● డీఫాల్టర్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయింపులు చేయకుండా రికవరీ కోసం ఆర్‌ఆర్ యాక్ట్ ఉపయోగించి ఎక్కువ మొత్తంలో సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లర్లపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించడం, సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లులను బ్లాక్ లిస్ట్‌లో ఉంచడంతో అక్రమ దందా తగ్గిందనే భావన జిల్లాలో నెలకొన్న సమయంలో సుమారు 450 బస్తాల ధాన్యం అక్రమంగా ఇతర రాష్ట్రానికి ఓ మిల్లర్ తరలించే ప్రయత్నం చేస్తూ విఫలం కావడంతో సీఎంఆర్ దందా ఆగలేదు.. రహస్యంగా కొనసాగుతుందనే ఆరోపణలు జిల్లావ్యాప్తంగా గుప్పుమంటున్నాయి. అధికారులంతా స్వాతంత్య్ర వేడుకల్లో బిజీగా ఉంటారనే భావనలో సదరు మిల్లర్ సాయంత్రం వేళ భారీ మొత్తంలో ధాన్యం అక్రమ తరలింపునకు ప్రణాళిక రచించినా.. సీసీఎస్ పోలీసులు పక్కా సమాచారంతో లారీని పట్టుకోవడంతో మిల్లర్ ప్రణాళిక బెడిసికొట్టినట్లయింది.
కొందరు మిల్లర్లు ప్రభుత్వం సీఎంఆర్ కోసం మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎక్కువ ధరకు విక్రయించుకొని స్థానికంగా రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన బియ్యాన్ని వారు నియమించుకున్న ఏజెంట్ల ద్వారా సేకరించి సైక్లింగ్ చేస్తూ అక్రమార్జనకు తెగబడుతున్నారు. సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారు సైతం రాజకీయ నేతల అండదండలతో రేషన్ దందా కొనసాగిస్తూ డబ్బు సంపాదనకు వెంపర్లాడుతున్నారు. పౌరసరఫరాలశాఖ అధికారులు నామమాత్రపు పర్యవేక్షణ చేసేలా డబ్బుతో లొంగదీసుకున్నారన్న ఆరోపణలు జిల్లాలో వినిపిస్తున్నాయి. టెక్నికల్ అసిస్టెంట్లు కచ్చితంగా వ్యవహరిస్తే ఒక్క బస్తా రేషన్ బియ్యం కూడా రీసైక్లింగ్ అయ్యే పరిస్థితి ఉండదు. సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయింపుల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం చేరడం.. తిరిగి అవే బియ్యం సీఎస్‌సీ గోదాంకు చేరడం, సీఎంఆర్ ధాన్యం ఇతర ప్రాంతాలకు తరలించడం లాంటి అన్ని ప్రక్రియల్లో అఽధికారుల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
పెబ్బేరులో సీసీఎస్ పోలీసులు పట్టుకున్న లారీలోని ధాన్యం నమూనాలను సేకరించాం. సదరు మిల్లులోనూ ధాన్యం బస్తాల వివరాలను స్వయంగా వెళ్లి పరిశీలిస్తాం. పూర్తి వివరాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ వెల్లడిస్తారు. ప్రభుత్వం పంపిణీ చేసిన గోనెసంచుల్లోనే ధాన్యం అక్రమంగా తరలిస్తున్నారనే విషయంపై స్పష్టత లేదు. కాగా సీఎంఆర్ కోసం మిల్లర్లుకు కేటాయించిన ధాన్యం అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించడం, ఇతర అక్రమాలకు పాల్పడకుండా పర్యవేక్షణ పెంచుతాం. కఠిన చర్యలకు కలెక్టర్, ఉన్నతాధికారులకు సిఫారస్ చేస్తాం. – కాశీవిశ్వనాథం,
జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
పక్క రాష్ట్రాలకు యథేచ్ఛగా వరి ధాన్యం తరలింపు
తాజాగా పెబ్బేరులో ధాన్యం లారీని పట్టుకున్న అధికారులు
నామమాత్రపు కేసుల నమోదుతో
జంకని మిల్లర్లు
నేతల అండదండలతోనే అక్రమాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు