
పల్లెగడ్డను వదులుకోం
ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు..
మరికల్: తమ పూర్వీకులు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతూ తమకు కానుకగా ఇచ్చిన ‘పల్లెగడ్డ’ను వదులుకోమని గ్రామస్తులు ముక్తకంఠంతో తేల్చిచెబుతున్నారు. తమ గోడును ప్రభుత్వం పట్టించుకోకపోయినా కోర్టులో న్యాయ పోరాటం చేసి.. తమ గ్రామాన్ని కాపాడుకుంటామని శపథం చేస్తున్నారు. నిజాం నిరంకుశ పాలన నాటి నుంచి తరతరాలుగా తమ పూర్వీకులు ఊరిని కాపాడుకుంటూ వస్తున్నారని.. 2018లో ఓ అజ్ఞాత వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా చిన్నరాజమూరు ఆంజనేయస్వామి దేవాలయ భూమిలో పల్లెగడ్డ గ్రామం ఉందని ఫిర్యాదు చేయడంతో తమకు సమస్యలు మొదలయ్యాయని వాపోతున్నారు. అప్పటి నుంచి ఎండోమెంట్ అధికారులు తమకు దశల వారీగా కోర్టు నుంచి నోటీసులు జారీచేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
1,624 మందికిపైగా జనాభా..
నాలుగు కుటుంబాలతో మొదలైన పల్లెగడ్డ గ్రామంలో 250కి పైగా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. 20 ఎకరాల గ్రామకంఠం ఉంది. మొత్తం 1,624 జనాభా ఉండగా.. 745 మంది ఓటర్లు ఉన్నారు. 254 రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలో 40 మంది, అంగన్‌వాడీ కేంద్రంలో 25మంది చదువుకుంటున్నారు. 250 ఇళ్లకు పైగా విద్యుత్ మీటర్లు ఉండగా.. ఇంటి పన్ను, నల్లా పన్నులు చెల్లిస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలో ఆంజనేయస్వామి, శివాలయాలు, నలుదిక్కులా గ్రామదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. 2 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉన్నాయి.
గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, రేషన్‌షాపు, సీసీరోడ్లు, డ్రెయినేజీలు, మిషన్ భగీరథ నీటి సరఫరా తదితర అభివృద్ధి పనులు ఎన్నో జరిగాయి. కొత్త పంచాయతీగానూ ఏర్పాటు చేశారు. 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పల్లెగడ్డ గ్రామాన్ని ఖాళీ చేయాలని 2018 నుంచి కోర్టు చుట్టూ తిప్పడం సరికాదు. ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామానికి న్యాయం చేయాలి.
– కుర్మయ్య, పల్లెగడ్డ
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పల్లెగడ్డ గ్రామం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో మొదటి విడతగా 66 ఇళ్లు మంజూరయ్యాయి. 1980లో కూడా అప్పటి ప్రభుత్వం 15 ఇళ్లను పేదలకు మంజూరు చేసింది. ఇన్నాళ్లుగా ప్రభుత్వ నిధులతో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి ఎండోమెంట్ అధికారులకు కనిపించడం లేదా.. కోర్టులో న్యాయ పోరాటం చేసి గ్రామాన్ని కాపాడుకుంటాం.
– విజయ్, పల్లెగడ్డ
పల్లెగడ్డ గ్రామం విషయం దేవాదాయ ట్రిబ్యునల్ కోర్టు పరిధిలో ఉంది. త్వరలోనే మరికొంత మందికి కోర్టు నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 25 మందికి నోటీసులు జారీ అయ్యాయి. వారి వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే దేవాదాయశాఖ ట్రిబ్యునల్ కోర్టులో సమర్పించాలి.
– కవిత, దేవాదాయశాఖ ఈఓ,
మహబూబ్‌నగర్
ముక్తకంఠంతో నినదిస్తున్న గ్రామస్తులు
నేడు దేవాదాయశాఖ ట్రిబ్యునల్ కోర్టుకు హాజరుకానున్న 25మంది
పుట్టిన ఊరి కోసం
తమ వాదన వినిపిస్తామని వెల్లడి
ఎట్టి పరిస్థితుల్లోనూ
ఊరిని విడిచి వెళ్లమని శపథం
స్పందించని ప్రజాప్రతినిధులు
చిన్నరాజమూరు ఆంజనేయస్వామి ఆలయ భూమిలో నిర్మితమైన పల్లెగడ్డ గ్రామం మొదట్లో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. మరికల్ పంచాయతీ పరిధిలో ఉండటంతో కనీస వసతులకు నోచుకోక గ్రామస్తులు ఇబ్బందులు పడేవారు. కాలక్రమేణా గ్రామ జనాభా పెరగడంతో 1980లో అప్పటి ప్రభుత్వం 15 ఇళ్లను పేదలకు నిర్మించి ఇచ్చింది. అప్పట్లోనే ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటుచేశారు. గ్రామంలో అంతర్గత రహదారులకు ఇరువైపులా డ్రెయినేజీలు, పబ్లిక్ కొళాయిలు ఏర్పాటు చేశారు. ఇలా ప్రభుత్వ నిధులతో ప్రజా సమస్యలు తీరుస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర వచ్చాక గత ప్రభుత్వం నూతన పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చూట్టింది. అప్పటి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి చొరవతో మరికల్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పల్లెగడ్డను కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత ఉపాధి హామీ పథకం నిధులతో సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు నిర్మించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీరు అందిస్తున్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనం, సెగ్రిగేషన్ షెడ్, పల్లెప్రకృతి వనం, శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు వంటివి నిర్మించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పల్లెగడ్డ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి.. మొదటి విడతలో 66 ఇళ్లు మంజూరుచేయగా.. లబ్ధిదారులు పనులు సైతం ప్రారంభించారు. ఇలా ప్రభుత్వ నిధులతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతూ వస్తున్నారు. అయితే పల్లెగడ్డ గ్రామస్తుల సమస్యపై ప్రజాప్రతినిధులు పట్టనట్టుగా ఉండటం గమనార్హం.