
యూరియా కష్టాలు..!
అమరచింత: వానాకాలం పంటలు సాగుచేసిన రైతులు పొలాల్లో చల్లేందుకు యూరియా కావాలంటూ ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట పడిగాపులు పడుతూ అందినకాడికి తీసుకెళ్తున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. యూరియా సరిపడా అందడం లేదంటూ రైతులు రెడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నా.. అధికారులు మాత్రం సరిపడా నిల్వలు ఉన్నాయని, ఆందోళన వద్దంటూ ప్రకటనలిస్తున్నారు. కాగా సరైన సమయానికి యూరియాను సరఫరా చేయలేక పోతున్నారని రైతన్నలు ఆరోపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వానకాలం వరిసాగు 2.75 లక్షల ఎకరాలు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేసి 26 వేల మెట్రిక్ టన్నులు అవసరమని ప్రభుత్వానికి నివేదిక అందించారు. కానీ ప్రభుత్వం జిల్లాకు కేవలం 19 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేస్తున్నామని చెప్పడంతో జిల్లా వ్యవసాయ ఆధికారులు మిగిలిన యూరియా కోసం మరోమారు ప్రభుత్వానికి నివేదించనున్నారు. సకాలంలో యూరియా పంటలకు అందించకుంటే నష్టపోయే ప్రమాదం ఉందని.. ఎకరాకు రెండు బస్తాల చొప్పున సరఫరా చేయాలంటున్నారు రైతు సంఘాల నాయకులు.
సొసైటీలు, ఆగ్రో రైతు
సేవాకేంద్రాలకు కేటాయింపు..
యూరియాను జిల్లాలోని అన్ని ఫర్టిలైజర్ దుకాణాలకు కేటాయించకుండా కేవలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవాకేంద్రాలకు మాత్రమే సరఫరా చేస్తుండటంతో రైతులు నిత్యం ఆయా కేంద్రాల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధిక ధరలకు విక్రయిస్తే ఆయా కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని.. ప్రస్తుతం వీటికి మాత్రమే సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మండలానికి కేవలం రెండు, మూడు కేంద్రాల్లోనే యూరియా లభిస్తుండటంతో అన్ని గ్రామాల రైతులు అక్కడికే తరలిరావడంతో కిటకిటలాడుతున్నాయి. వచ్చిన నిల్వలు సరిపోక పలువురు రైతులు నిరాశతో వెనక్కి తిరిగి వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో యూరియా పంటలకు అందుతుందని.. అందుకే యూరియా బస్తాల కోసం పడిగాపులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు.
2020 గణాంకాల ప్రకారం..
జిల్లాలో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నందున అధికారులు ప్రతి సంవత్సరం పంటలకు సరిపడా యూరియా తెప్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారు. ఈసారి 2020 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు ఎంత మేర యూరియా దిగుమతి చేసుకున్నారనే గణాంకాలను పరిశీలించి సరఫరాకు సిద్ధమయ్యారు. 26 వేల మెట్రిక్ టన్నులు అవసరమని ప్రతిపాదనలు పంపితే కేవలం 19 వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారని జిల్లా అధికారులు చెబుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం..
పట్టణ శివారులో 4 ఎకరాల్లో వరి సాగుచేశా. ఎకరాకు రెండు బస్తాల యూరియా చల్లాలని.. 8 బస్తాలు ఇవ్వమని ఆగ్రో రైతు సేవాకేంద్రానికి వెళ్తే పట్టాదారు పాసు పుస్తకానికి రెండు మాత్రమే ఇచ్చారు. యూరి యా అందక ఇబ్బందులు పడుతున్నాం.
– కడియాల నర్సింహులు, రైతు, అమరచింత
ప్రభుత్వ వైఫల్యం..
యూరియా సకాలంలో సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫర్టిలైజర్ దుకాణాల వద్ద గంటల తరబడి వరుసలో నిలబడే పరిస్థితి నెలకొంది. అధిక ధరలకు యూరియాను విక్రయిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. 14 ఎకరాల్లో వరి సాగు చేసిన నాకు రెండు బస్తాల యూరియా ఏ మేరకు సరిపోతుంది.
– మల్లారెడ్డి, రైతు, కిష్టంపల్లి
సరిపడా సరఫరా చేయాలి..
నేను ఆరు ఎకరాల్లో వరి సాగు చేశా. కానీ యూరియాకు వెళ్తే రెండు బస్తాలు ఇస్తామంటున్నారు. పంటలకు సరిపడా ఇవ్వాలని అడిగినా సంబంధిత ఫర్టిలైజర్ దుకాణ యాజమానులు పట్టించుకోవడం లేదు. ఎకరాకు రెండు బస్తాల లెక్కన యూరియా అందించి పంట కాపాడాలి.
– ఆంజనేయులు, రైతు, కిష్టంపల్లి
అధైర్యపడొద్దు..
రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. జిల్లాకు 26 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని జిల్లా వ్యవసాయ అధికారి ప్రతిపాదనలు పంపించారు. కాగా 19 వేల మెట్రిక్ టన్నులు ఇస్తామని ఉన్నతాధికారులు ప్రకటించి ఇప్పటి వరకు 13 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. మిగతాది కూడా త్వరలోనే వస్తుంది.. రైతులకు సరిపడా సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– దామోదర్, ఏడీఏ
ధరల నియంత్రణపై పర్యవేక్షణేది?
అధిక ధరకు ఎరువులు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు వ్యవసాయశాఖ అధికారులు నిరంతరం రైతు ఆగ్రో సేవాకేంద్రాలు, సొసైటీలను తనిఖీ చేస్తున్నారు. యూరియా బస్తా ధర రూ.265 ఉండగా.. హమాలీ ఛార్జీలతో కలిపి కొందరు రూ.270, మరికొందరు రూ.285 తీసుకుంటున్నారని ఫిర్యాదులు అందుతుండటంతో వ్యవసాయ అధికారులు యూరియా పంపిణీపై దృష్టి సారిస్తున్నారు.
దుకాణాల వద్ద అన్నదాతల పడిగాపులు
ఎకరాకు రెండు బస్తాలు అంటున్న అధికారులు
పట్టాదారు పాసు పుస్తకానికి రెండు ఇస్తామంటున్న దుకాణదారులు
వానాకాలం సాగుకు 26 వేల మె.ట. అవసరమని అధికారుల నివేదిక
19 వేల మెట్రిక్ టన్నులే అందిస్తామంటున్న ప్రభుత్వం
ఇప్పటి వరకు జిల్లాకు చేరింది 13 వేల మె.ట. మాత్రమే..
జిల్లాలో వానకాలం సాగు అంచనా 2.75 లక్షల ఎకరాలు