
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి
వనపర్తి రూరల్: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని శనివారం పెబ్బేరు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఇందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకం, అష్టోత్తరం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించి భగవద్గీత పఠనం చేశారు. అనంతరం పట్టణ వీధుల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆర్యవైశ్య మహిళలు భారీగా ఊరేగింపు నిర్వహించారు. ర్యాలీలో కోలాటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయంత్రం ఆలయంలో మహిళలు శ్రీకృష్ణుడి తులాభారం నిర్వహించి ఉట్టికొట్టి, మహా మంగళహారతి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.