
రాష్ట్రంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
గోపాల్‌పేట: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మాటలతో కడుపు నింపే పార్టీలని.. ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచి ఒక్కసారి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని మహబూబ్‌నగర్ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. గురువారం ఆమె ఏదులలోని పెద్దగుట్టపై ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ మద్దతుతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని.. తెలంగాణ ఏర్పడకముందు గొప్పలు చెప్పిన బీఆర్‌ఎస్, అమలుకాని ఆరు గ్యారెంటీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారని.. త్వరలోనే తెలంగాణలో బీజేపీ పాగా వేయనుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర నిధులు వినియోగిస్తూ కాంగ్రెస్ పథకాలుగా పేర్లు మార్చి అమలు చేస్తూ పొంగిపోతున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో మహిళలకు రూ.2,500, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఏమయ్యాయని, సగం మంది రైతులకు పంట రుణమాఫీ వర్తించలేదని, నిరోద్యోగభృతి రాలేదని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడం లేదని విమర్శించారు. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 30 మంది బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబ్బిరెడ్డి, ఓబీసీ జిల్లా ప్రధానకార్యదర్శి కృష్ణగౌడ్, మణివర్ధన్‌సాగర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మాటలతో కడుపు నింపే పార్టీలు
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ