
రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
వనపర్తి: జిల్లాకేంద్రంలో అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో జరిగే 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయనతో పాటు సంఘం ప్రధానకార్యదర్శి ఏ.సాంబ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల కిందట ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పురుడు పోసుకున్న ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం శాసీ్త్రయ విద్య సాధనే లక్ష్యంగా సమసమాజ స్థాపనకు పోరాడుతోందన్నారు. విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ సమాజంలో ఉన్న వివక్షపై జరిగిన, జరుగుతున్న పోరాటాల్లో భాగస్వామ్యం అవుతున్నామని చెప్పారు. ఇంతటి చరిత్ర కలిగిన పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జిల్లాకేంద్రంలో నిర్వహించాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని.. ప్రభుత్వ విద్యారంగంపై పాలకులు కనీస దృష్టి సారించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ విద్యాసంస్థలు సమస్యలకు నిలయాలుగా మారాయని.. పరిష్కరించే నాథుడే కరువయ్యారన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్ఛలవిడిగా అనుమతులిస్తూ వాటి అభివృద్ధికి ప్రభుత్వం పరోక్షంగా మద్దతునిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, రియింబర్స్‌మెంట్ నాలుగేళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతుంటే సంబంధిత అధికారుల పర్యవేక్షణ తప్పా పరిష్కార చర్యలు ఏమీ లేవని తెలిపారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఇచ్చిన హామీ హామీగానే మిగిలిందన్నారు. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎన్ని జరిగినా ఆయా కళాశాలపై అధికారుల చర్యలు శూన్యమేనని తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్, రంజిత్, సహాయ కార్యదర్శులు గణేష్, పవన్, రాష్ట్ర నాయకులు గణేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.