
చదువుతో పాటు ఉపాధి కల్పనే లక్ష్యం
గద్వాలటౌన్: యువతకు చదువుతో పాటు పలు ఉపాధి కోర్సులు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఐటీఐలను ఇటీవల ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఏజీసీ)గా ఉన్నతీకరించి పలు అధునాతన కోర్సులను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. పట్టణ శివారులో ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రాన్ని, అక్కడ కొనసాగుతున్న పనులను శుక్రవారం కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి జితేందర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థల సహకారంతో ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. సమాజంలో ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న రోబోటిక్, విద్యుత్ వాహనాల మరమ్మతులు, అడ్వాన్స్‌డ్ సీఎన్‌సీ టెక్నీషియన్ వంటి కోర్సులు అందుబాటులోకి తెచ్చిందన్నారు. పోటీ ప్రపంచంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హనుమంతు, సహాయ లేబర్ కమిషనర్ మహేష్‌కుమార్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక, ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ పాల్గొన్నారు.