దోపిడీదారులు వెళ్లినంత మాత్రాన నష్టం లేదు
తప్పుడు మార్గాలకు రాజకీయాల్లో మనుగడ ఉండదు
2029లో మళ్లీ జగనే ముఖ్యమంత్రి
శాసనమండలి విపక్ష నేత
బొత్స సత్యనారాయణ
గజపతినగరం రూరల్:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని, వారే పార్టీకి వెన్నెముక అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. స్థానిక బెల్లాన కన్వెన్షన్‌లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అప్పలనరసయ్య అధ్యక్షతన ఆదివారం జరిగింది. సమావేశంలో బొత్స మాట్లాడుతూ, తప్పుడు మార్గాలు వెతికే వారికి రాజకీయాల్లో మనుగడ ఉండదన్నారు. ఆర్థిక లావాదేవీలు కారణంగానే కొంద రు పార్టీని వదిలి వెళ్లారని విమర్శించారు. ఒకరు పార్టీని వదిలి వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. పార్టీని వదిలి వెళ్లిన వారిని ఆలీబాబా 40 దొంగలుగా అభివర్ణించారు. ఒకరు పోతే మరొకరు వస్తారని రాజకీయాల్లో ఇదంతా సర్వ సాధారణం అన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమని, భవిష్యత్తులో కార్యకర్తలే పార్టీకి సమన్వయకర్తలుగా వ్యవహరించి పార్టీని బలోపేతం దిశగా తీసుకువెళ్లాలన్నారు. ఏ ఒక్కరు అధైర్య పడవద్దని.. ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విలువలతో కూడిన రాజకీయాలే శాశ్వతంగా నిలు స్తాయని అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. 2029 సాధారణ ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్ ప్రభుత్వం రావడం, జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. టీడీపీ రెండున్న ర సంవత్సరాల పాలన అంతా బూటకమని, ఎన్నికల హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మాయ చేశారని విమర్శించారు. సమావేశంలో యువ నాయకురాలు, భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొత్స అనూష, యువ నాయకులు బొత్స సందీప్, బొత్స సాయిగురు నాయుడు, కిల్లి సత్యనారాయణ, సిరిపురపు జగన్‌మోహన్ రావు, పీరుబండి జైహింద్‌కుమార్, బూడి వెంకటరావు, మండల పార్టీ అధ్యక్షుడు పల్లి సంజీవరావు, బోద్దల చిన్నమనాయుడు, జాగారపు అప్పారావు, గొర్లె రవికుమార్, కృష్ణార్జున, జెడ్పీటీసీలు గొర్లె సరయు, రౌతు రాజేశ్వరి, ఎంపీపీలు సింహాద్రి అప్పలనాయుడు, చల్ల చల్లమనాయుడు, మాజీ జెడ్పీటీసీ మంత్రి అప్పలనాయుడు, మాజీ ఎంపీపీ కంది తిరుపతి నాయుడు, మండల సురేష్, బెల్లాన త్రినాధ్, కరణం ఆదినారాయణ, పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
‘బొత్స’ ఓ బ్రాండ్... : కురసాల కన్నబాబు
ఉత్తరాంధ్ర జిల్లాల్లో బొత్స బ్రాండ్‌కు ఉన్న ఇమేజ్ చెప్పనవసరం లేదని, ఆ నీడలో ఎంతోమంది నాయకులు ఎదిగారని పార్టీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. ఒకరు పార్టీని వదిలి వెళ్లినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని... అలాంటి నాయకులను ఎంతోమందిని బొత్స సత్యనారాయణ తయారు చేసుకోగలరన్నారు. జగన్‌మోహన్ రెడ్డి లాంటి ధైర్యం ఉన్న నాయకుడు దేశంలోనే కనిపించరన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు పార్టీని వదిలి వెళ్లినప్పుడు కూడా అదే ధైర్యంతో 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన ఘనత జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మళ్లీ 2029లో జగన్‌మోహన్ రెడ్డి సీఎం కావడం తధ్యమన్నారు. ఉత్తరాంధ్ర భూములను చంద్రబాబు ప్రభుత్వం పప్పు బెల్లాళ్ల పంచి పెడుతుందని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి..: బెల్లాన
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసగిస్తూ వస్తుందన్నారు. మాయ మాటలు, డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజలను మభ్యపెడుతుందన్నారు. బొత్స సత్యనారాయణ ఓ విశ్వవిద్యాలయం లాంటి వారిని, ఎంతోమంది నాయకులను తయారు చేసుకునే సామర్థ్యం వారిలో ఉందన్నారు.
చంద్రబాబు... కరువు అన్నదమ్ములు :
అప్పలనరసయ్య
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తేనే కరువు విలయతాండం చేస్తుందని, చంద్రబాబు, కరువు అన్నదమ్ములుగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అప్పలనరసయ్య అభివర్ణించారు. దోచుకోవడం... దాచుకోవడంలో టీడీపీ నాయకులు బిజీ బిజీగా ఉన్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త పింఛన్లు డ్రామా తెరపైకి తీసుకువచ్చారన్నారు. ఈ నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహం చూస్తుంటే... ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉత్సాహంలో ఉన్నారన్నారు.
సైకిల్‌కు బ్రేకులు లేవు.. :
ఎమ్మెల్సీ సురేష్‌బాబు
చంద్రబాబు సైకిల్‌కి బ్రేకులు లేవని, బెల్లు మాత్రమే పని చేస్తుందని ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు ఎద్దేవా చేశారు. సైకిల్ పూర్తిగా తుప్పు పట్టిందని, రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు జగన్‌మోహన్ రెడ్డి హయాంలోనే 90 శాతం పూర్తయిందని, ఆఖరిలో ప్రారంభోత్సవం చేసుకుని తన గొప్పగా చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేయటన్నారు.


