కకావికలమవుతున్న కాపురాలు..! | - | Sakshi
Sakshi News home page

కకావికలమవుతున్న కాపురాలు..!

Sep 21 2026 12:20 AM | Updated on Sep 21 2026 12:20 AM

కకావికలమవుతున్న కాపురాలు..!

పార్వతీపురం రూరల్‌: ఉమ్మడి విజయనగరం జిల్లాలో పక్కదారి పడుతున్న బంధాలతో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. సెల్‌ఫోన్ల దుర్వినియోగం, సోషల్‌ మీడియా మోజులో పడి అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. విచక్షణ కోల్పోయి క్షణికావేశంలో కట్టుకున్న వారినే కడతేర్చే సంస్కృతి పెరిగిపోతోంది. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలతో కుటుంబాలు వీధిన పడుతుండగా, కన్నవారి అఘాయిత్యాల వల్ల ఎందరో చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. గత ఏడాది (2025)లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏకంగా 30 హత్యలు జరగ్గా, వాటిలో విజయనగరం జిల్లాలో 22, పార్వతీపురం మన్యం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి.

అడ్డుతొలగించుకునేందుకు దారుణం

పాలకొండ మండలం బర్నసీతంపేటకు చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి (32) జూన్‌ 2026లో హత్యకు గురైంది. మాజీ వలంటీర్‌ రెడ్డి భువనేశ్వర్‌, ఆమెతో ప్రేమాయణం నడుపుతూనే, అదే సమయంలో తీగల కృపారాణి అనే వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఉషారాణి ఒత్తిడి చేయడంతో, ప్రియురాలితో కలిసి పకడ్బందీగా పథకం పన్నాడు. జూన్‌ 6న కారులో తీసుకెళ్లి, కూల్‌ డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం మృతదేహం బయటపడకుండా కాళ్లు, చేతులు కట్టేసి, బరువైన రాయి కట్టి తుమరాడ వద్దనున్న చెరువులో పడేశారు.

పరువు పోతుందనే భయంతో..

కురుపాం మండలానికి చెందిన ఇద్దరు పిల్లలున్న వివాహిత (30), సీతంపేట మండలానికి చెందిన మరో వివాహితుడు (34) మధ్య కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వీరు గ్రామం విడిచి హైదరాబాద్‌ పారిపోగా, కుటుంబసభ్యులు పట్టుకుని తిరిగి సొంతూరికి తీసుకొస్తున్నారు. అయితే గ్రామంలో అడుగుపెడితే తమ భాగోతం తెలిసిపోయి బంధువుల ఎదుట పరువు పోతుందనే భయంతో మార్గమధ్యంలో కారు దిగి పురుగు మందు తాగేశారు (జూలై 2024). ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు వదిలారు.

ఉరివేసి..ఆత్మహత్యగా చిత్రీకరించి..

దత్తివలసకు చెందిన వివాహితుడు పెరుమాళ్ల రాంబాబు, నడిమివలసకు చెందిన 19 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె పెళ్లికి ఒత్తిడి చేయడంతో, ఏప్రిల్‌ 2025లో గొంతు నులిమి చంపేశాడు. స్నేహితుల సాయంతో మృతదేహాన్ని బైక్‌పై దాదాపు 150 కిలోమీటర్లు తీసుకెళ్లి, సాలూరు మండలంలోని గాదెపల్లెవలస వద్ద చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశాడు. సీసీటీవీ ఫుటేజీలు, కాల్‌ డేటా ఆధారంగా ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది.

అనుమానపు కాటు..మద్యానికి బలి..

జూలై 8న జామి మండలం అలమండలో ఒడిశాకు చెందిన సంజయ్‌ బెహరా తన భార్యను అనుమానంతో దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. దీంతో వారి ఏకై క కుమారుడు అనాథ అయ్యాడు. అలాగే, ఆగస్టు 2025లో సాలూరులో తాపీ మేసీ్త్రగా పనిచేసే రామకృష్ణ.. మద్యం కొనేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భార్య త్రివేణి మెడకు మిక్సీ వైరు బిగించి దారుణంగా హత్య చేశాడు. జూలై 15న పూసపాటిరేగ మండలం పెద్దనడిపల్లిలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వివాహితను హతమార్చడంతో ఇద్దరు చిన్నారులు తల్లికి దూరమయ్యారు.

మాయమాటల మత్తులో..

మంటగలుస్తున్న మానవత్వం

ప్రియుల మోజులో పడి..కట్టుకున్న వారినే కడతేర్చి

ఆవేశంలో అఘాయిత్యం..అంధకారంలో చిన్నారుల భవిష్యత్తు

ఆధునికత ముసుగులో..అంతరిస్తున్న విలువలు

క్షణికావేశం వద్దు.. కుటుంబ భవిష్యత్తే ముఖ్యం..

వివాహేతర సంబంధాల మోజులో పడి, విచక్షణ కోల్పోయి అఘాయిత్యాలకు పాల్పడడం అత్యంత బాధాకరం. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల పచ్చని కాపురాలు కూలిపోవడమే కాకుండా, అభంశుభం తెలియని చిన్నారులు అనాథలవుతున్నారు. ఏదైనా దారుణానికి ఒడిగట్టే ముందు ఒక్కసారి కుటుంబం, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ చట్టాలపై కనీస అవగాహన పెంచుకోవాలి. తప్పు చేస్తే చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న భయం ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా ప్రజల్లో భరోసా నింపుతూ, నేరాల నియంత్రణపై విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. కుటుంబంలో కలహాలు, అనుమానాలు వస్తే పెద్దల సమక్షంలో లేదా కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కరించుకోవాలి. అంతేకానీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దు. ప్రశాంత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలి.

బి.వెంకట్రావు, సీఐ,

పార్వతీపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement