లక్కవరపుకోట: మండలంలోని భీమాళి గ్రామంలో శనివారం సాయంత్రం జరిగిన దొంగతనం కలకలం రేపింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న నత్తల రవి బస్ మెకానిక్ పనులు చేస్తుంటాడు. ఆయన తల్లి వ్యవసాయ పనులు చేస్తుంది. ఈ క్రమంలో శనివారం ఎప్పటి మాదిరి ఇంటికి తాళాలు వేసి కిటికీ పక్కన చెప్పులు స్టాండ్ వద్ద తాళాలు దాచిపెట్టి తల్లీకొడుకులు ఎవరి పనులకు వెళ్లిపోయారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు గమనించి తాళాలను తీసుకుని ఇంట్లోకి వెళ్లి బీరువాలో గల వివిధ రకాల మూడు తులాల బంగారు వస్తువులు, రూ.20వేల నగదును దోచుకుపోయారు. పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తల్లి, కొడుకు చూసేసరికి ఇంటిలో సామగ్రి చిందరవందరగా పడి ఉండడంగమనించి బీరువాలో చూడగా వస్తువులు కనిపించలేదు. దీంతో ఎల్.కోట పోలీస్‌లకు ఫిర్యాదు చేయుగా ఆదివారం ఉదయం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలను సేకరించారు. పట్టపగలే దొంగతనం జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.


