విజయనగరం: జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి సర్కారు అండగా ఉంటుందని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖమంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వాస్తవాలు వెలుగు తీసి ప్రభుత్వానికి గైడ్ చేయాలని, వాస్తవాలు ప్రజలకు తెలపాల్సిన బాధ్యత జర్నలిస్టుల దేనన్నారు. ఏపీయూడబ్ల్యూజే 27 వ మహాసభ విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వానికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. మంత్రిని దుశ్శాలువాతో యూనియన్ నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ డి.సోమసుందర్ మాట్లాడుతూ అక్టోబర్ 2 న నిర్వహించే ఏపీయూడబ్ల్యూజే జాతీయస్థాయి నిరసనలో జర్నలిస్టుల గొంతు ప్రభుత్వానికి, ప్రజలకు వినిపించాలని కోరారు. అమరావతి మార్మోగాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఈవీ సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల కోసం ఉద్యమించే ఏకై క యూనియన్ ఏపీయూడబ్ల్యూజే అన్నారు. ప్రభుత్వాలు హామీలు ఇచ్చి నెరవేర్చడంలో మాట తప్పుతున్నాయని మండిపడ్డారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఆర్థిక భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు వై.శివ, సామ్నా అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ఐజే యూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అజయ్ బాబు, సీనియర్ నాయకుడు దిమిలి అచ్యుతరావు, రామచంద్ర రావు తదితరులు జర్నలిస్టుల హక్కులు, పోరాటాలపై ప్రసంగించారు. జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర మహాపాత్రో సభకు స్వాగతం పలికారు. సభలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, ఎస్పీ ఏఆర్ దామోదర్, జిల్లా సమాచార పౌర సంబంధాల ఉప సంచాలకుడు గోవిందరాజులు, జర్నలిస్టు నాయకులు టి.రాధాకృష్ణ, ఎం ఎస్‌ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు గురజాడ అప్పారావు విగ్రహానికి, సర్ సీవై చింతామణి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


