రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు జిల్లా జట్లు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు జిల్లా జట్లు సిద్ధం

Sep 21 2026 12:20 AM | Updated on Sep 21 2026 12:20 AM

విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్టు సిద్ధమయ్యాయి. ఈ మేరకు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నగర శివారుల్లో గల విజ్జి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్‌–14,16,18,20 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహించిన ఎంపికల్లో రన్నింగ్‌, జంపింగ్‌, త్రోయింగ్‌ అంశాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 130 మంది క్రీడాకారులకు అక్కినేని నాగేశ్వరరావు ఫ్యాన్స్‌ జిల్లా అధ్యక్షుడు టీ షర్టులు అందజేశారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెల 2 నుంచి 4వ తేదీ వరకు కర్నూలు జిల్లా ఆదోనిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలాకృష్ణ, జి.శ్రీకాంత్‌, కోశాధికారి ఆనందకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

అక్టోబర్‌ 2న సత్యాగ్రహ దీక్ష

కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ టీచర్స్‌ అండ్‌ వర్కర్స్‌ జేఏసీ

విజయనగరం గంటస్తంభం: కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌టైమ్‌, డైలీవేజ్‌, కంటింజెంట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమానం వేతనం, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 2న విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ టీచర్స్‌ అండ్‌ వర్కర్స్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ బి.కాంతారావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ఎన్‌పీఆర్‌ భవన్‌లో సత్యాగ్రహ దీక్ష వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యోగ భద్రత, 62 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంపు, మెడికల్‌, చైల్డ్‌కేర్‌ సెలవులు తదితర హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని కోరారు.

పిడుగు పడి ఆవు మృతి

బొండపల్లి: మండలంలోని గెద్దపేట గ్రామంలో పిడుగు పడి ఆవు మృతి చెందింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఇల్లాపు శ్రీనుకు చెందిన ఆవును పొలాల్లోకి తీసుకువెళ్లగా అది మేత మేస్తుండగా పిడుగు పడడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయి మృతి చెందింది. ఈ విషయాన్ని బొండపల్లి పశువైద్యాధికారికి బాధిత రైతు కుటుంబసభ్యులు తెలియచేసి వివరాలు అందజేశారు.

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

బొండపల్లి: ఆర్థిక ఇబ్బందుల కారణంగా మండలంలోని కనిమెరక రైల్వే పట్టాల వద్ద వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా నిలబడి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బొబ్బిలి రైల్వే హెచ్‌సీ ఈశ్వర్రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మరువాడ గ్రామానికి చెందిన భీమవరపు శ్రీనివాసరావు (50) కొద్ది నెలలుగా ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో గజపతినగరం నుంచి విజయనగరంవె వెళ్తున్న బొకారో రైలుకు ఎదురుగా నిలబడడంతో వేగంగా వస్తున్న రైలు ధాటికి శ్రీనివాస రావు శరీరం మొత్తం నుజ్జునుజ్జయింది. సంఘటనా స్థలాన్ని బొబ్బిలి రైల్వే హెచ్‌సీ ఈశ్వర్రావు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మృతునికి భార్య లక్ష్మితో పాటు,పెళ్లిళ్లు అయిన కూతురు సంధ్య, కుమారుడు ప్రదీప్‌ ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గజపతినగరంలోని ప్రభుత్వ ఏరియా కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించి రైల్వే పోలీసులు కేసు నయోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement