గండేపల్లి: ఎద్దులను తరలిస్తున్న ఓ వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు విజయనగరం జిల్లా అలమండ సంత నుంచి ఏలూరుకు 8 ఎద్దులను తరలిస్తున్న మినీ బొలెరో వ్యాన్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని జెడ్ రాగంపేట సీహెచ్‌సీకి వెళ్లే మార్గంలోకి వచ్చే సరికి మోటార్ సైకిల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న తాళ్లూరుకు చెందిన సాయి తీవ్రంగా గాయపడగా, మర్రిపాక నుంచి మిరప కోతకు యల్లమిల్లి వెళ్తున్న లక్ష్మి గాయపడింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సీహెచ్‌సీకి తరలించగా తీవ్రంగా గాయపడిన సాయిని జగ్గంపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఎద్దులను తరలిస్తున్న వ్యాన్‌ను గండేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా వ్యాన్‌లో తరలిస్తున్న ఎద్దులకు ఎటువంటి ఆహార పానీయాలు లేకపోగా కనీసం కాలు కదపలేని స్థితిలో కిక్కిరిసిన ప్రయాణంతో వేదన పడుతున్న తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాహనంలో కిక్కిరిసి ఎద్దుల తరలింపు


