క్రీడాకారుల భవితతో.. ఆటలు! | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారుల భవితతో.. ఆటలు!

Sep 18 2026 12:51 AM | Updated on Sep 18 2026 12:51 AM

కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు

విజయనగరం:

మ పిల్లలు క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారు. దీనికోసం చిన్నప్పటి నుంచే శిక్షణ ఇప్పిస్తారు. లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తారు. పతకాలు సాధిస్తే ఆనంద పడతారు. ఉజ్వల భవిత లభిస్తుందని ఆశ పడతారు. తాజాగా కూటమి ప్రభుత్వంలో చేపట్టిన మెగా డీఎస్సీలో స్పోర్ట్‌ కోటాలో చేపట్టిన ఉపాధ్యాయుల నియామకాల్లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం క్రీడల్లో పతకాలు సాధించిన, ప్రతిభ చూపిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులను కలవరపెడుతోంది. అసోసియేషన్ల పేరుతో కొన్నాళ్లుగా సాగుతున్న దందా చర్చనీయాంశంగా మారింది. ప్రతిభ చూపే క్రీడాకారులను పక్కనపెట్టి క్రీడా అసోసియేషన్ల పేరుతో పలువురు సాగిస్తున్న వ్యాపారం క్రీడాలోకాన్ని విస్మయపరుస్తోంది. ప్రభుత్వ పెద్దల సాక్షిగా సాగుతున్న క్రీడాకోటాలో ఉద్యోగవ్యాపారం ఆవేదనకు గురిచేస్తోంది. పోటీలో పాల్గొని గెలవకపోయినా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించినట్టు సర్టిఫికెట్‌లు ఇవ్వడం విస్తుపరుస్తోంది. ఎంత మొత్తంలో చేతులు మారకుంటే ఈ తరహా దందాకు దిగుతారన్న వాదన బలంగా వినిపిస్తోంది.

గుర్తింపు లేని అసోసియేషన్‌లే ఎక్కువ..!

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధికారిక లెక్కల ప్రకారం మొత్తంగా 37 క్రీడా అసోసియేషన్లు ఉన్నాయి. ప్రతి క్రీడకు ఒక అసోసియేషన్‌ ఉంటుంది. ఒలింపిక్‌ సంఘం అనుసంధానంగా క్రీడా సంఘాలు ఉంటాయి. ఇవి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్న అసోసియేషన్లకు అనుసంధానమై ఉంటాయి. ఏటా అండర్‌–12, 14, 17, 19 పాఠశాల, కళాశాల స్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఇవి కాకుండా వివిధ క్రీడా అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని మండలాల వారీగా ఎంపిక చేసుకుని జిల్లాస్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం కల్పిస్తారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రస్థాయి, అక్కడ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి అవకాశం వస్తుంది. ఇక్కడ జారీ చేసే

నిబంధనలు పాటించే అసోసియేషన్‌లు ఎన్ని....?

రాష్ట్ర క్రీడా సంఘాల గుర్తింపు క్రమబద్ధీకరించకపోవడంతో వందలాదిమంది సీనియర్‌ జాతీయస్థాయి క్రీడాకారులు ఆటలో శ్రమించి సాధించిన ధ్రువపత్రాలు పనికి రావడం లేదు. ఒకవైపు అసోసియేషన్‌ ప్రతినిధుల నిర్లక్ష్యం, మరోవైపు ఆధిపత్య పోరుతో క్రీడాకారుల జీవితాలు అంధకారమయమవుతున్నాయి. వాస్తవానికి ప్రతి పోటీకి ఒలింపిక్‌ అసోసియేషన్‌ నుంచి ప్రతినిధి, అలాగే క్రీడా అధికారులు రావాల్సి ఉంటుందన్నది నిబంధన. క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఒక్కో క్రీడకు మూడు, నాలుగు అసోసియేషన్లు ఏర్పాటు చేసుకొని నామ మాత్రపు పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం సాధారణ విషయం కాదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారులు హాజరవుతారు. రెండు, మూడు రోజుల వరకు పోటీలు జరుగుతాయి. హాజరైన క్రీడాకారులతో పాటు శిక్షకులకు భోజన వసతితో పాటు బాల బాలికలకు వేర్వేరుగా వసతి కల్పించాల్సి ఉంది. నామమాత్రంగా పోటీలు నిర్వహించి మిన్నకుండి పోతున్నారు.

గుర్తింపు పొందాల్సిందే..

ప్రతి క్రీడా సంఘం తప్పనిసరిగా గుర్తింపు పొందాల్సిందేనని శాప్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన సంఘాల వివరాలు క్రీడా యాప్‌లో నమెదు చేసుకోవాలి. అలా గుర్తింపు పొందిన సంఘాలకు మాత్రమే జిల్లా స్థాయి గుర్తింపు వస్తుంది. రెండు, మూడు సంఘాలు ఉండటానికి వీలులేకుండా చర్యలు చేపడుతున్నాం. క్రీడాకారులు గుర్తింపు సంఘాల నిర్వహించే పోటీల్లో పాల్గొంటేనే వారి ధ్రువపత్రాలకు విలువ ఉంటుంది. లేనిపక్షంలో నష్టపోతారు.

– ఎస్‌.వెంకటేశ్వరరావు,

జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, విజయనగరం

గుర్తింపు లేని సంఘాలతో

క్రీడాకారులకు అన్యాయం

రాష్ట్ర, జిల్లా స్థాయిలో రెన్యువల్‌

చేయించడంలో నిర్లక్ష్యం

ఈ సంగతి తెలియక మోసపోతున్న

క్రీడాకారులు

రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు అర్హత కల్పిస్తామంటూ వసూళ్ల దందా

మెగా డీఎస్సీలో వెలుగులోకి వచ్చిన నకిలీ సర్టిఫికెట్లతో సర్వత్రా ఆందోళన

ఇకపై గుర్తింపు తప్పనిసరి అంటున్న జిల్లా క్రీడాభివృద్ధి అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement