బొబ్బిలిరూరల్: మండలంలోని పక్కి,రాముడు వలస, శివడవలస పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖాధికారులు సూచిస్తున్నారు.రాత్రిపూట వాటి సంచారం ఎక్కువగా ఉంటుందని, ఎప్పుడు ఏ గ్రామంలోకి ప్రవేశిస్తాయో గమనించడం కష్టంగా మారిందిదని, రాత్రివేళ ఎవరూ బయట తిరగరాదని తెలియజేశారు. ఆదివారం ఆయా గ్రామాల్లోని చెరకు, మొక్కజొన్న పంటలను ఏనుగులు నాశనం చేసి రైతులకు తీరని నష్టం చేకూర్చాయి. కాగా ఏనుగుల గుంపును సీతానగరం మండలంలోని జోగింపేట ఎలిఫెంట్ జోన్‌కు తరలించేందుకు రెండు కుంకీ ఏనుగులైన జయంత్, అభిమన్యులను రంగంలోకి దించినా పొలాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపువద్దకు అవి చేరే అవకాశం లేక ఆ చర్యలు ఫలించలేదు. కుంకీ ఏనుగులను ఏనుగుల గుంపు వద్దకు తరలించడంలో అధికారుల చర్యలు విఫలమయ్యాయి. ఎప్పటికప్పుడు అవి తమ గమ్యస్థానాన్ని మార్చుకోవడంతో వాటి ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా ఉండడంతో ఫారెస్ట్ అధికారులు చేసేది లేక పక్కి గ్రామంలో కుంకీ ఏనుగులను ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఏనుగుల గుంపు రాముడువలస, ముత్తాయివలస మీదుగా తెర్లాం మండలం నందబలగ కొండపైకి చేరుకున్నాయని రేంజర్ రామనరేష్ తెలిపారు.ఏనుగుల కదలికలపై ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని,త్వరలో వాటిని ఎలిఫెంట్ జోన్‌కు తరలిస్తామని మన్యం జిల్లా అటవీశాఖాధికారి ప్రసన్న తెలిపారు.అంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,కవ్వింపు చర్యలకు పాల్ప డవద్దని సూచించారు.
అటవీ శాఖాధికారుల సూచన


