● ఐయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు
అప్పలనాయుడు
బొబ్బిలి: వర్కింగ్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలని ఇండిపెండెంట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు జి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. యూనియన్ శాఖ నిర్మాణం కోసం ఆదివారం బొబ్బిలి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులు వేరే ఉపాధి పొందలేక, స్థిరమైన ఆదాయం లేక అవస్థలు పడుతున్నారన్నారు. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇళ్ల స్థలాలు, గుర్తింపు కార్డులున్న అందరికీ అక్రిడిటేషన్లను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా బొబ్బిలి నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సోరు సాంబయ్యను ఎంపిక చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని సాంబయ్య అన్నారు. కార్యక్రమంలో నాయకుడు పి.యోగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.


