● ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో హ్యాట్రిక్
నెల్లిమర్ల రూరల్: ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో జరుగుతున్న జూనియర్ ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2026 పోటీ ల్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన యువ వెయిట్‌లిఫ్టర్ శనపతి గురునాయుడు సత్తాచాటాడు. శనివారం జరిగిన 60 కేజీల విభాగంలో స్నాచ్‌లో 119 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 146 కేజీల బరువును ఎత్తి రెండు విభాగాల్లోనూ వెండి పతకాలు సాధించాడు. మొత్తం 265 కేజీల బరువును స్కోర్‌చేసి ఆ విభాగంలోనూ మరో వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో, ఒకే పోటీలో మూడు వెండి పతకాలు సాధించి తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబర్చడంతో గ్రామస్తులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తంచేశారు.
మన్యం బంద్ విజయవంతం
సీతంపేట: ఆదివాసీ హక్కుల పరిరక్షణకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన మన్యంబంద్ విజయవంతమైంది. సీతంపేటలో ఉదయం నుంచే షాపులు తెరచుకోలేదు. 11 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గిరిజనులపై ప్రభుత్వ తీరుకు నిరసనగా గిరిజన సంఘం కార్యాలయం నుంచి సీతంపేట వారపు సంతవరకు ర్యాలీ చేశారు. అనంతరం కొద్ది సేపు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. గిరిజన హక్కులను కూటమి ప్రభుత్వం హరిస్తోందని, జీఓ నంబర్ 3ను చట్టం చేయాలని, గిరిజనులకు ఉద్యోగాలు కల్పించాలని, 1/70 చట్టం పకడ్బందీగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. నాన్‌షెడ్యూల్డ్ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలని నినదించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ.అశోక్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.లక్ష్మణరావు, గిరిజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.తిరుపతిరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, నాయకులు కె.భాస్కరరావు, శ్రీరాములు, బి.అప్పారావు, గంగాధర్, పి.సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.
కుంకీ ఏనుగుల తరలింపు
సీతానగరం: మండలంలోని జోగింపేట ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ఉన్న కుంకీ ఏనుగులను తెర్లాం మండలం రామినాయుడువలస ప్రాంతంలో ఉన్న ఏనుగులను మచ్చిక చేసేందుకు వీలుగా జిల్లా అటవీ శాఖ అధికారి జీఏపీ ప్రసూన పర్యవేక్షణలో ఆ ప్రాంతానికి శనివారం తరలించారు. జయంత్, అభిమన్యు కుంకీ ఏనుగులను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రధాన రహదారిపైకి రావడంతో ట్రాకర్స్ ముందస్తు హెచ్చరికలు చేశారు. ఏళ్లుగా ఈ ప్రాంతంలో తిరుగాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఏనుగుల గుంపును కుంకీ ఏనుగులు ఏ మేరకు మచ్చిక చేసుకొని ఈ ప్రాంతం నుంచి తీసుకుపోతాయోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.


