రోల్‌ మోడల్‌ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

రోల్‌ మోడల్‌ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలి

Aug 9 2026 2:28 AM | Updated on Aug 9 2026 2:28 AM

గుమ్మలక్ష్మీపురం: మెరుగైన వైద్యసేవలు అందించి భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రోల్‌ మోడల్‌ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. ఈ మేరకు నాబార్డ్‌ – 225 నిధులు రూ.8.95 కోట్లతో భద్రగిరిలో నిర్మించిన 50 పడకల నూతన ఆస్పత్రి భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులను ఇతర ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తూ ఉంటే ప్రయోజనం ఏం ఉంటుందని, కావున రిఫర్‌ చేయకుండా సాధ్యమైనంత వరకూ స్థానిక ఆస్పత్రిలోనే ప్రజలకు వైద్య సేవలు అందివ్వాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో అన్నారు.

అవే అబద్దాలు..

ఎన్నికల ముందు చెప్పిన అబద్దాలనే జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అచ్చెన్నాయుడు మళ్లీ ఈ సమావేశంలోనూ కొనసాగించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 10.50 లక్షల కోట్లు అప్పు చేసిందని ఓ సారి, రూ.13 లక్షల కోట్లు అప్పు చేసిందని మరోసారి నిడకడలేని మాటలు చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చాం.. అధికారంలోకి వచ్చాక హామీలన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో రివ్యూ చేస్తే గత ప్రభుత్వం చేసిన అప్పులు చూసి గుండె దడ పుట్టిందన్నారు. అన్ని హామీలు అమలు చేయాలంటే డబ్బుల్లేవంటూనే ఒకటి రెండు తప్ప సూపర్‌ 6 హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి మోదీ సహకారం అందిస్తుండంతోనే రాష్ట్రాన్ని అభివృధ్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. దీనికి ముందు ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ భద్రగిరి ఆస్పత్రిని 50 పడకల నుంచి 100 పడకల ఆస్పత్రిగా మార్పు చేయాలంటూ ఇన్‌చార్జ్‌ మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఆర్డీఓ మాధురి, డీసీహెచ్‌ఎస్‌ నాగభూషణరావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement