విజయనగరం:
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక జీఓలతో డీఎస్సీలో అక్రమాలను ప్రోత్సహించిందని, అర్హులకు అన్యాయం చేసిందని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనిసరావు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన మొదటి సంతకానికి ఇదేనా విలువ అని ప్రశ్నించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సమగ్రవిచారణ జరపకుంటే నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమం తరహాలో రాష్ట్రంలో మహా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన రెండవ రోజు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న మహిళలకు బత్తాయిరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయపాలనకు వ్యతిరేకంగా, యువత, విద్యార్థులకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్టు వెల్లడించారు. ప్రజస్వామ్య ప్రభుత్వంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, డీఎస్సీలో జరిగిన అక్రమాలపై శాంతియుతంగా నిరసన చేపడుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దౌర్జన్యకాండకు పాల్పడడం దుర్మార్గమన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో 10 మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చిన వారిలో ఒకరిని ప్రశ్నిస్తే నిజం బట్టబయలైందని, కర్రాబిల్లా అట ఆడిన వ్యక్తికి ఎలా ఉద్యోగం వచ్చిందో తమకు తెలియదంటూ చుట్టపక్కల వారు చెప్పడం గమనార్హమని పేర్కొన్నారు. సదరు అభ్యర్థితో పాటు తల్లిదండ్రులతో తామే నేరుగా మాట్లాడితే స్థానిక ఎమ్మెల్యేకు తమ ఇబ్బందులు చెప్పుకుంటే ఈ ఉద్యోగం ఇప్పించారంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో 10 మందికి ఉద్యోగాలు వస్తే ఎన్ని పారదర్శకంగా జరిగాయే ప్రభుత్వ పెద్దలకు, ప్రజలకు తెలియాలన్నారు. బాధ్యతగల ప్రతిపక్షంగా యువత కోసం చేపడుతున్న పోరుబాటలో భాగంగా ఈ నెల 10న నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టబోయే నిరసన ర్యాలీల్లో యువత, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
● ఇదెక్కడి రక్షణ..
మహిళల రక్షణ, భద్రత కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమల్లోకి తెచ్చిన దిశ చట్టం రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని జెడ్పీ చైర్మన్ అన్నారు. చట్టాలను మరింత సమర్ధవంతంగా అమలు చేయాల్సింది పోయి వాటిని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేయడం అన్యాయమన్నారు. మహిళలంటే గౌరవం ఉంటే చట్టాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, జిల్లా యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌశిక్, తదితరులు పాల్గొన్నారు.
లోకేశ్ రాజీనామా చేయాలి
డీఎస్సీలో జరిగిన అక్రమాలపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని, అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీల మేరకు నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3వేల నిరుద్యోగ భృతి అమలు చేయాలన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం బకాయిలు రూ.9,500 కోట్ల తక్షణమే విడుదల చేయాలన్నారు. పేదకుటుంబాల పిల్లలు ఉన్నత చదువులు అభ్యసించాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం సరికాదన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. తమ అనుకూల మీడియాతో అబద్ధాలను వాస్తవాలుగా వక్రీకరించడం తగదన్నారు.
సమగ్ర విచారణ జరిపి యువతకు న్యాయం చేయకుంటే ఉద్యమం తప్పదు
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదిక
తరహాలో ఉద్యమం చేపడతాం
స్పష్టంచేసిన జెడ్పీచైర్మన్
మజ్జి శ్రీనివాసరావు


