రామభద్రపురం: రేషన్ డిపోలకు సరుకులు సరఫరా చేస్తున్న ఎంఎల్‌ఎస్ పాయింట్ నిర్వాహకులు, రేషన్ డీలర్లు కుమ్మకై ్క లబ్ధిదారులకు అన్యాయం చేయడంపై రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు బి.కాంతారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయ ఆహార భద్రత పథకం అమలులో భాగంగా శుక్రవారం ఆయన రామభద్రపురం మండలంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలు, ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, సాంఘిక సంక్షేమ బాలుర వలసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న స్టాక్‌ను పరిశీలించారు. వసతి గృహం, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు వడ్డించే గుడ్డు బరువు, అరటి పండ్ల నాణ్యతపై సిబ్బందిని ప్రశ్నించగా ఎవ్వరికీ తెలియదని సమాధానం ఇవ్వడంతో అసహనం వ్యక్తంచేశారు. మహంతి వీధిలోని రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. తూనికలు, కొలతలకు సంబంధించి లీగల్ మెట్రాలజీ ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడంపై ఇన్‌స్పెక్టర్ మధుసంతోష్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. రేషన్ దుకాణాల జిల్లా అధ్యక్షుడు చొక్కాపు రామారావు డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతుండగా ఫుడ్ కమిషన్ మెంబరు మాట్లాడుతూ ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి బియ్యం ఎన్నికిలోలు తెస్తున్నారు? ఎందుకు తక్కువ తూస్తున్నారు? గోదాం నిర్వాహకులను ఎందుకు ఎదిరించి అడగడం లేదని ప్రశ్నించారు. గోదాం నిర్వాహకులు తూకంలో తక్కువ ఇచ్చిన బియ్యంను తీసుకొచ్చి ఇక్కడ లబ్ధిదారులకు తూకంలో తక్కువ తూసి వారిని నష్టపరుస్తున్నారన్నారు.
● రామభద్రపురంలోని 5వ అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తూ రికార్డుల నిర్వహణ బాగాలేదని, కేంద్రం నిర్వాహకురాలికి మెమో ఇవ్వాలని సీడీపీఓను ఆదేశించారు.
● రామభద్రపురం సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని సందర్శించి సరుకుల గోదాం పరిశీలించారు. అక్కడ బియ్యం స్టాకు బుక్‌లో కంటే సుమారు 30 కిలోలు ఎక్కువగా ఉన్నందున హాస్ట్‌ల్ నిర్వాహకులకు మెమో జారీ చేయాలని సాంఘిక సంక్షేమశాఖ డీడీని ఆదేశించారు.
● శ్రీరాంనగర్‌కాలనీలోని పాఠశాలను సందర్శిస్తుండగా పిల్లలకు మధ్యాహ్నభోజనం వండేందుకు సరిపడా గ్యాస్ ఇవ్వడం లేదని అక్కడి హెచ్‌ఎం ఫిర్యాదు చేశారు. పాఠశాలకు గ్యాస్ ఇవ్వకపోతే డీఎస్‌ఓ దృష్టికి తీసుకెళ్లాలని హెచ్‌ఎంకు సూచించారు. రేషన్ డిపోను పరిశిలీస్తూ కొంత అదనపు బియ్యం పౌరసరఫరాల శాఖ ఇచ్చిన గోనె సంచిలో కాకుండా ప్లాస్టిక్ సంచిలో నిల్వ ఉండడాన్ని గుర్తించి డీలర్‌ను ప్రశ్నించారు. దీనిపై డీలర్ పొంతన లేని సమాధానం చెప్పడంతో ఆమెకు మెమో ఇచ్చి చర్యలు తీసుకోవాలని డీఎస్‌ఓ మురళీనాథ్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను ఎవ్వరూ గౌరవించడం లేదని, నిబంధనలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ మురళీనాథ్, సీఎస్‌డీటీ సాయికృష్ణ, ఎంఈఓలు తిరుమలప్రసాద్, పెంటయ్య, సీడీపీఓలు ఉమాభారతి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
ఎంఎల్‌ఎస్ పాయింట్ నిర్వాహకులు, డీలర్ల కుమ్మకై ్క లబ్ధిదారులకు నష్టం
రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు
బి.కాంతారావు
ఒక రేషన్ డిపో డీలర్, అంగన్‌వాడీ కార్యకర్త, ఎస్సీ హాస్టల్ వార్డెన్‌లకు మెమోలు జారీకి ఆదేశం


