ఉసురు తీస్తున్న ఉపాధి | - | Sakshi
Sakshi News home page

ఉసురు తీస్తున్న ఉపాధి

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

ఉసురు తీస్తున్న ఉపాధి

బొబ్బిలి: రాష్ట్రాలు విడిచి వచ్చి ఉపాధి కోసం బొబ్బిలిలోని గ్రోత్‌ సెంటర్‌లో పనిచేస్తున్న కార్మికులకు సౌకర్యాలు, వేతనాల కన్నా యజమానుల నిర్లక్ష్యం వల్ల వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. చుట్టుపక్కల ఎంత మంది నిరుద్యోగులున్నా గతంలో జీఓలు విడుదల చేసినప్పటికీ స్థానికులను యాజమాన్యాలు చేర్చుకోవడం లేదు. గ్రోత్‌ సెంటర్‌లో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువస్తున్నారు. అదేవిధంగా వివిధ స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ తో పాటు ఉన్నతోద్యోగాలు చేసేవారు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. వారైతే తక్కువ వేతనం, ప్రమాదాలు జరిగినా అంతదూరం నుంచి వచ్చి అల్లరి చేయరు. పైగా 10 గంటల నుంచి 12 గంటల వరకూ పనిచేయించుకోవచ్చు. ఏమైనా అయితే కంపెనీలకు నచ్చినంత పరిహారం ఇచ్చినా గమ్మునుంటారనే తీరు గ్రోత్‌సెంటర్‌లో నడుస్తోంది. స్థానిక గురుదత్త కంపెనీలో మంగళవారం మృతి చెందిన బికాస్‌ అనే యువకుడికి ఎంతో భవిష్యత్తున్నప్పటికీ చిన్నతనంలోనే ఇక్కడ జరిగిన ప్రమాదంలో మృతి చెంది కుటుంబ సభ్యులను అనాథలను చేయడంలో అధికారులు, యజమానుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

బెర్రీలో ఐదుగురు ఒకేసారి

బెర్రీ ఫెర్రో ఎల్లాయీస్‌లో నాలుగేళ్ల క్రితం ఇరుకు గదిలో ఉంటున్న 14 మంది గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఐదుగురు బీహార్‌కు చెందిన యువకులే కాలిన గాయాలతో మృతి చెందారు. అలాగే ఇక్కడున్నపెట్రోల్‌ బంకులో ముగ్గురు మృతి చెందారు. ఫర్నేస్‌ కాలిపోయి బాలాజీ కంపెనీలో నలుగురు మృతి చెందారు. సుమారు 12 సంవత్సరాల క్రితం సంక్రాంతి సమయంలో జరిగిన బెర్రీ కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.లక్ష చొప్పున దహన సంస్కారాలకు, పరిహారం కింద ఏడు లక్షలు చొప్పున పరిహారం ముట్టజెప్పారు. అదే గ్రోత్‌ సెంటర్‌లో ప్రమాదాల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు అందించిన అత్యధిక పరిహారమంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు కూడా ఎవరైనా మృతిచెందితే రూ.2లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వీరు కాక గ్రోత్‌ సెంటర్‌లోని పలు పరిశ్రమల్లో ఇప్పటివరకూ దాదాపు 20 నుంచి 30 మంది ప్రాణాలు విడిచి ఉంటారని కార్మికులే చెబుతున్నారు.

గ్రోత్‌సెంటర్‌లో పరిశ్రమల కన్నా యజమానుల నిర్లక్ష్యమే అధికం

తక్కువ వేతనంతో ఎక్కువ పని..

మృతి చెందితే సెటిల్‌మెంట్లు

ఇక్కడ పనిలో బిహార్‌, ఎంపీ ప్రాంతాల వారు

రక్షణ లేదు.రక్షణ పరికరాలివ్వరు

ఇక్కడి కంపెనీల్లో పనిచేసే కార్మికులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతోపాటు రక్షణ పరికరాలు ఉండడం లేదు. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే వారు మృత్యువాత పడుతున్నారు. కంపెనీల భవనాలు కూడా నాణ్యత లేకుండా ఉంటున్నాయి. కొన్నాళ్ల క్రితం ఓ కంపెనీ గోడ కూలి మేకల పెంపకదార్లు ఇద్దరు మృతి చెందారు.

కంపెనీలపై కేసులుండడం లేదు

ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సెటిల్‌మెంట్లు చేస్తున్నారే తప్ప కేసులు ఉండడం లేదు. దీని వల్ల కార్మిక శాఖ, కంపెనీల తరపున రావాల్సిన నాణ్యమైన పరిహారం ఆయా కుటుంబాలకు అందడం లేదు. పైగా మధ్యవర్తులు తలదూర్చి డబ్బులు చేతులు మారుతున్నాయి. దీని వలన ఆయా కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో వారి రక్తసంబంధీకులను ఇక్కడే దహనం చేసి కన్నీళ్లతో తిరిగి వెళ్లిపోతున్నారు. కంపెనీలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. సోరు సాంబయ్య,

అంబేడ్కర్‌ పోరాట సమితి, బొబ్బిలి

ఎదిరించి అడిగితే ముడుపులు ఇచ్చి కామ్‌ చేస్తారు

గ్రోత్‌ సెంటర్‌ కార్మికులకు అసౌకర్యాలున్నాయని, భద్రత లేదని, ఇరుకు గదుల్లో పెట్టి ఉంచుతున్నారని ప్రశ్నించిన వారికి ముడుపులు ఇచ్చి కామ్‌ చేస్తున్నారు. ఏపీఐఐసీ ఎం.డి కాని, స్థానిక పాలకులు కాని ఏనాడైనా గ్రోత్‌సెంటర్‌లోని పరిశ్రమలు, సౌకర్యాలపై ఆరా తీశారా? ప్రెస్‌మీట్లు పెట్టారా? అంటే అదీ లేదు. మరి కంపెనీల యాజమాన్యాలు నిర్లక్ష్యం ఎందుకు వీడుతాయి.?

పొట్నూరు శంకర రావు

అధికారులెవరూ ఉండరు

గ్రోత్‌ సెంటర్‌లో పరిపాలన భవనం దాదాపు ఓ కలెక్టరేట్‌ను తలపిస్తుంది. కానీ ఇక్కడ అధికారులు ఎవరూ ఉండడం లేదు. ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌, వాచ్‌మన్‌ మాత్రమే ఉంటారు. వారానికో రెండు వారాలకో వచ్చే అధికారులు ఓ సారి తూతూమంత్రంగా పరిశీలించి వెళ్లిపోతున్నారు. అత్యవసరంగా అధికారుల అవసరం ఉందంటే విజయనగరం లేదా శ్రీకాకుళం వెళ్లాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement