చీపురుపల్లి: యువత, నిరుద్యోగులకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై యువత పక్షాన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గరివిడిలోని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందన్నారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన టీడీపీ అనుయాయులకు, డబ్బులు ఇచ్చిన వారిని అడ్డగోలుగా ఉద్యోగాలకు ఎంపిక చేశారన్నారు. జిల్లాలో 10 మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చాయని అందులో ఒక్కరికీ కూడా అర్హత లేదన్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. రాష్ట్రంలో 14 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు, లోకేష్ ఆటలాడుకున్నారన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల వైజాగ్ నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటనను ప్రభుత్వం ఎంతగా అడ్డుకోవాలని చూసినా ఆయన వెంట వచ్చిన జన ప్రభంజనం చూస్తే 2029లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమైందన్నారు.
జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షలు
డీఎస్సీ నియామకాల్లో అవినీతి, అక్రమాలకు సంబంధించి విద్యా శాఖ మంత్రి లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణతో పాటు నిరుద్యోగులకు భృతి, ఫీజు రీయింబర్సుమెంట్ నిధులు విడుదల డిమాండ్లతో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నాలుగు రోజులు రిలే నిరాహార దీక్షలు ద్వారా నిరసన చేపట్టనున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఈ నెల 6న గురువారం నుంచి 9వ తేదీ వరకు రిలే నిరహార దీక్షలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతీ రోజు నియోజకవర్గ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరహార దీక్షలు చేయాలన్నారు. అనంతరం ఈ నెల 10న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్, బొత్స అనూష, నియోజకవర్గ పరిశీలకులు శోభా స్వాతిరాణి తదితరులు పాల్గొన్నారు.
మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ
టీడీపీ అనుయాయులకు, డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలు
నిరసనగా నేటి నుంచి నాలుగు రోజులు జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షలు
లోకేష్ రాజీనామా చేయాలి,
సీబీఐతో విచారణ జరిపించాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,
జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు


