విజయనగరం: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహించిన డీఎస్సీలో జరిగిన అక్రమాలపై బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సమరభేరి నిర్వహిస్తామని, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి ఉద్ఘాటించారు. తన నివాసంలో పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీ నియామకాల్లో యువతకు జరిగిన అన్యాయంపై మంగళవారం నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఏపీ జెన్ జీ వార్ పేరిట చేపట్టబోయే నిరసన కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. ఈ మేరకు విజయనగరం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కోలగట్ల వీరభధ్రస్వామి మాట్లాడుతూ బాధ్యత గల ప్రతిపక్షంగా కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దురాగత పాలనలో యువతకు జరిగిన అన్యాయంపై ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు విజయనగరం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరిపించి కష్టపడి చదివిన నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ 6వ తేదీన నియోజకవర్గ యువజన, విద్యార్థి విభాగాల సారధ్యంలో, 7న మహిళా విభాగం సారధ్యంలో, 8న నగర పార్టీ/అనుబంధ విభాగాల సారధ్యంలో, 9న మండల పార్టీ సారధ్యంలో రిలే దీక్షలు జరుగుతాయని వెల్లడించారు. 10వ తేదీన నియోజకవర్గ స్థాయిలో భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి అధిక సంఖ్యలో భాగస్వాములను చేయటం ద్వారా విజయవంతం చేయాల్సిన బాధ్యత వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఉందని సూచించారు.
హమీల అమలుపై ప్రమాణం చేయగలరా..?
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ హమీలు 100 శాతం అమలు చేశామంటూ శాసనసభ సాక్షిగా చేస్తున్న ప్రకటనలపై కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేయాలని కోలగట్ల వీరభద్రస్వామి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వం అరాచకాలు, అవినీతికి పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. ఏం చేయకున్నా.. అన్నీ తామే చేశామంటూ అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసగించటం దుర్మార్గమమన్నారు. ప్రభుత్వం చేస్తున్న చేష్టలపై ప్రజల్లో సందర్భం వచ్చినపుడు చర్చించి వారిని చైతన్యవంతులను చేయాలని కోరారు. సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, మాజీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టి వీరవెంకట రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు కెల్ల త్రినాధరావు, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌశిక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, జిల్లా పెన్షనర్లు, ఉద్యోగుల విభాగం అధ్యక్షుడు డోలా మన్మధకుమార్ పాల్గొన్నారు.
విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి
అవకతవకలపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిపించాలి
6 నుంచి 9 వరకు నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు
10న విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ
ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి


