రెవెన్యూ వసూళ్లను ముమ్మరం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ వసూళ్లను ముమ్మరం చేయాలి

Aug 5 2026 2:23 AM | Updated on Aug 5 2026 2:23 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌డీఎంఏ రవీంద్ర

విజయనగరం అర్బన్‌: నగరంలో మున్సిపల్‌ రెవెన్యూ వసూళ్లను వేగవంతం చేయాలని రీజనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఆర్‌డీఎంఏ) రవీంద్ర అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం ఆయన మున్సిపల్‌ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక మొత్తంలో పన్ను బకాయిలు ఉన్న వారి నుంచి వసూలు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందడుగు వేయాలని స్పష్టం చేశారు. వివిధ అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ పలు కీలక సూచనలు అందించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో విజయనగరం మున్సిపల్‌ కమిషనర్‌ బాలస్వామి, ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ కొండపల్లి సాంబమూర్తి, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ రమణమూర్తి, రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, టీపీఓ అప్పలరాజు, టీపీఎస్‌ అనిత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌గా సుజాత

విజయనగరం గంటస్తంభం: విజయనగరం కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌(ఎఫ్‌ఏసీ)గా టి.సుజాత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఈమె అనకాపల్లి జిల్లాలో కార్మిక శాఖ సహాయ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా విజయనగరానికి నియమితులయ్యారు. విజయనగరం కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పని చేసిన ఎస్‌డీవీ ప్రసాదరావు పదవీ విరమణ చేయడంతో, ఆయన స్థానంలో టి.సుజాత బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శాఖ అధికారులతో సమావేశమైన ఆమె, కార్మిక సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేలా కృషి చేస్తామని తెలిపారు.

శ్రీవారికి రూ. 5 లక్షల విరాళం

రాజాం: పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన బాదం చంద్రశేఖర్‌ అనే భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.5 లక్షల విరాళం అందించి తన భక్తిని చాటుకున్నాడు. టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్రకి ఈ విరాళాన్ని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ను టీటీడీ అధికారులు అభినందించి వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో పాటు తీర్ధ ప్రసాదాలు అందించి సత్కరించారు. ఈ విరాళంతో భక్తులకు అన్నదానం చేయాలని భక్తుడు ఈ సందర్భంగా కోరాడు.

10న ఆశా వర్కర్ల చలో కలెక్టరేట్‌

విజయనగరం ఫోర్ట్‌: ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని, గ్రూప్‌ ఇన్సూరెన్సు రూ.10 లక్షలు, అర్హులైన వారికి ఏఎన్‌ఎంలుగా ప్రమోషన్లు ఇవ్వాలంటూ ఈ నెల 10న చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు మహలక్ష్మి తెలిపారు. రాకోడు యూపీహెచ్‌సీ, అర్బన్‌ మెడికల్‌ ఆఫీసర్లకు మంగళవారం నోటీసు అందజేశారు. అనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని, రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ తదితర డిమాండ్లపై ధర్నాలో పాల్గొంటున్నట్టు తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాగమ్మ, ఆదిలక్ష్మి, మంగమ్మ, అప్పయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement