విజయనగరం టౌన్: మనిషి ప్రాణాలను నిలబెట్టే మహోన్నతమైన దానమే అవయవదానమని ఎస్పీ ఎఆర్.దామోదర్ పేర్కొన్నారు. అవయవదానంపై రూపొందించిన వాల్‌పోస్టర్లను జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి అవయవదానం చేయడం ద్వారా పలువురుకి పునర్జన్మ లభించే అవకాశం ఉంటుందన్నారు. మరణాంతరం కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప దాతృత్వ కార్యమన్నారు. సమాజంలో అవయవదానంపై ఉన్న అపోహలను తొలగించి, శాసీ్త్రయ అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి కుటుంబం అవయవదానంపై సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య సిబ్బంది ఈ అంశంపై ప్రజల్లో విస్త్రత ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే ప్రతి కార్యక్రమానికి పోలీస్ శాఖ పూర్తి సహకారమందిస్తుందన్నారు. కార్యక్రమంలో అఖిల భారత శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీ, సంఘం జిల్లా అధ్యక్షుడు గెద్ద చిరంజీవి, సలహాదారు మమ్ముల తిరుపతిరావు, కోశాధికారి గొర్లె చిన్నమనాయుడు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ లెంక రాణికుమారి తదితరులు పాల్గొన్నారు.


