సాక్షి, పార్వతీపురం మన్యం:
ఉమ్మడి విజయనగరం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని కేంద్రాల్లో కాలం చెల్లిన, గడువు ముగియడానికి దగ్గరలో ఉన్న ఆహార పదార్థాలు అందుతున్నాయని స్థానికులు, లబ్ధిదారులు చెబుతున్నారు. పౌష్టికాహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ల తరబడి ఒకే కాంట్రాక్టర్‌కు సరఫరా బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనివల్ల ఉన్నతాధికారులతో లాలూచీ పడి, నాణ్యత లేని సరుకులు అంటగడుతున్నారు. కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే సమయంలో గడువు తేదీలు, నిల్వ విధానం, నాణ్యత వంటి అంశాలను సంబంధిత ఐసీడీఎస్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉన్నప్పటికీ.. ఆ దిశగా తగిన పర్యవేక్షణ లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.
● గుడ్లలో పిల్లలు.. కాలం చెల్లిన సరుకులు
విజయనగరం జిల్లాలో 11 ప్రాజెక్టుల పరిధిలో 2,500 కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 72,416 మంది కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని 10 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,075 కేంద్రాలుండగా.. 47 వేల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపాన్ని తగ్గించడం కోసం గుడ్లు, చక్కీలు, పాలు, బాలామృతం, కందిపప్పు, నూనె, బెల్లం వంటి సరకులు అందిస్తున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు ఏళ్లుగా కొంతమంది కాంట్రాక్టర్లకే సరకుల సరఫరా బాధ్యతలు అప్పగిస్తున్నారు. కమీషన్లకు అలవాటు పడిన ప్రాజెక్టు అధికారులు.. సరుకుల నాణ్యత పరిశీలనను పూర్తిగా గాలికి వదిలేసి, చిన్నారుల నోట్లో మట్టి కొడుతున్నారు. ఐసీడీఎస్ జిల్లా అధికారులకు సైతం నెలవారీ కమీషన్లు వెళ్లిపోతుండటంతో గుడ్డిగా బిల్లులపై సంతకం పెట్టేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విజయనగరం జిల్లాలోని పలు ప్రాజెక్టులకు ఇటీవల కాలంలో కరిగిపోయిన కోడిగుడ్లే గుత్తేదారులు అందిస్తున్నారు. పలు ప్రాజెక్టులలో వీటిని అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న సమయంలో, గుడ్డు లోపల కోడి పిల్లల ఆకారం కనిపించడం గమనార్హం.
గతంలో దీనిపై కాంట్రాక్టర్లకు, ప్రాజెక్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. గడువు దాటిన బాలామృతం, నాసిరకమైవ కందిపప్పు, బెల్లం సరఫరా చేసిన ఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. నాసిరకం లేదా గడువు ముగిసిన ఆహారం అందితే ప్రయోజనం దక్కకపోగా.. ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐసీడీఎస్ అధికారులు మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకుని, తమకు రావాల్సిన వాటాల కోసమే ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికై నా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లబ్ధి దారులు కోరుతున్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసిన గుడ్లలో కోడి పిల్లలు
సరుకుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్న కాంట్రాక్టర్లు
మామ్మూళ్ల మత్తులో ప్రాజెక్టు అధికారులు
ఫిర్యాదులు చేస్తున్నా.. స్పందించని జిల్లా అధికారులు


