చీపురుపల్లి: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల రెన్యువల్ ప్రక్రియను ఆర్డీఓ సుధారాణి పర్యవేక్షణలో ప్రారంభించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో రెన్యువల్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి కాంట్రాక్టు అధ్యాపకులు హాజరయ్యారు. 2026 ఏప్రిల్ 30 వరకు డిగ్రీ కళాశాలల్లో విధులు నిర్వహించిన కాంట్రాక్టు అధ్యాపకులకు రెన్యువల్ చేస్తున్నట్లు ఆర్డీఓ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సీహెచ్ లలిత పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
● రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత
విజయనగరం ఫోర్ట్: విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు తమపై తాము నమ్మకం ఉంచి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి వెలకట్టలేనిదన్నారు. కార్యక్రమంలో 184 మంది పదో తరగతి విద్యార్థులకు, 39 మంది ఇంటర్ విద్యార్థులకు మెడల్, ప్రశంసాపత్రం, రూ.20వేల నగదు అందించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మార్క్‌ఫెడ్ చైర్మన్ బంగారురాజు, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృషి తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎస్‌ఏ ఇన్‌చార్జ్ ఈఈ మాతృశాఖకు బదిలీ
విజయనగరం అర్బన్: సమగ్ర శిక్ష ఇంజినీరింగ్ విభాగంలో ఇన్‌చార్జ్ ఈఈగా పని చేస్తున్న ఎన్.హరిప్రసాద్‌ను మాతృశాఖ ఇరిగేషన్ శాఖకు బదిలీ చేశారు. ఈ మేరకు సమగ్ర శిక్ష ఎస్‌పీడీ నుంచి సోమవారం ఆదేశాలు వచ్చాయని డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. డిప్యూటేషన్‌పై ఆ శాఖ నుంచి డీఈ కేడర్‌లో వచ్చిన ఆయన ఏడాది క్రితం నుంచి ఇన్‌చార్జ్ ఈఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిప్యూటేషన్ పీరియడ్ జనవరి నెలతో ముగిసింది. అప్పటి నుంచి మాతృశాఖకు వెళ్లిపోవాలని శాఖపరమైన విజ్ఞప్తులు చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రధాన కార్యాలయంలో ఉన్న మాతృశాఖకు ఆయన్ని బదిలీ చేశారు.
మందుల దుకాణాల్లో తనిఖీలు
పార్వతీపురం రూరల్: మాదకద్రవ్యాల నియంత్రణకై చేపట్టిన ‘ఆపరేషన్ గరుడ’ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం పట్టణంలోని పలు మందుల దుకాణాల్లో అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ యోగేందర్ పర్యవేక్షణలో ఈగల్ బృందం, టౌన్ పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. స్థానిక స్వామి ఆస్పత్రి ప్రాంగణంలోని శ్రీరేణుక మెడికల్ స్టోర్స్, శ్రీ లక్ష్మీ గణపతి మెడికల్ షాపుల్లో బృందాలు సోదాలు చేశాయి. ఈ సందర్భంగా నిబంధనల ప్రకారం విక్రయించాల్సిన ఎన్‌ఆర్‌ఎక్స్ డ్రగ్స్ నిల్వలు, వాటికి సంబంధించిన రిజిస్టర్లు, కొనుగోలు రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం దుకాణాల నిర్వాహకులకు మాదకద్రవ్యాల నియంత్రణ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్వతీపురం టౌన్ ఎస్‌ఐ పి.సింహాచలం, ఈగల్ సెల్ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


