● స్పష్టం చేసిన ఈఈ గోవిందరావు
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ సీజన్‌కు ఇప్పట్లో నీటి విడుదల సాధ్యంకాదని ఈఈ బి.గోవిందరావు స్పష్టం చేశారు. ప్రాజెక్టు వద్ద కమిటీ చైర్మన్ పి.రామినాయుడు, నీటిసంఘాల అధ్యక్షులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులో నీటినిల్వలు గణనీయంగా పడిపోయాయని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.29 టీఎంసీ నీరు మాత్రమే ఉందని తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఎనిమిది మండలాల్లో 31వేల ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయడం కష్టతరమన్నారు. వర్షాలు కురిస్తే తప్ప సాగునీరందించలేమని కమిటీ సభ్యులకు తెలియజేశారు. కార్యక్రమంలో డీఈఈలు పి.అర్జున్, కె.ఈశ్వర ప్రసాద్, రవికుమార్, ఏఈలు పాల్గొన్నారు.


