● తల్లికి అంత్యక్రియలు పూర్తిచేసిన జెడ్పీచైర్మన్ చిన్నశ్రీను
● వీడ్కోలు యాత్రలో పాల్గొన్న మజ్జి, బొత్స కుటుంబ సభ్యులు
అంతిమయాత్రలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం, వైఎస్సార్ సీపీ
నాయకులు, అభిమానులు, బంధువులు
విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) మాతృమూర్తి మజ్జి కృష్ణవేణమ్మ (83) మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమెకు అంతిమ వీడ్కోలు పలికేందుకు బుధవారం వేలాదిగా తరలివచ్చారు. విజయనగరం ప్రదీప్‌నగర్‌లోని జెడ్పీ చైర్మన్ స్వగృహానికి విచ్చేసి కృష్ణవేణమ్మ భౌతికకాయాన్ని సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తోటపాలెంలోని సర్గధామంలో తల్లి అంత్యక్రియలను చిన్నశ్రీను పూర్తిచేశారు. కృష్ణవేణమ్మ మృతితో చిన్నశ్రీనుతో పాటు కుమార్తెలు పద్మ, రమ, కుమారి కన్నీరుపెట్టారు. శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే అప్పలనరసయ్యకు కృష్ణవేణమ్మ స్వయాన మేనత్త. అంతిమ యాత్రలో బొత్సతో పాటు శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరబధ్రస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, బెల్లాన చంద్రశేఖర్, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు తదితరులు పాల్గొన్నారు. చిన్న శ్రీను, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


