● మున్సిల్ టీచర్ సంఘాల ఐక్యవేదిక
విజయనగరం అర్బన్: నగరపాలక సంస్థ ప్రాథమిక, ప్రాఽథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయుల డివిజనల్ స్థాయి పని సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య సభ్యులు అభ్యంతరం తెలిపారు. తమ సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా డివిజన్ స్థాయిలో సర్దుబాటు ప్రక్రియ చేపడితే, కౌన్సెలింగ్‌ను పూర్తిగా బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు విజయనగరం నగరపాలక సంస్థ ఉపాధ్యాయులు శుక్రవారం డీఈఓ యు.మాణిక్యం నాయుడుని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 7వ తేదీన జరిగిన మండల స్థాయి పని సర్దుబాటులో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని మిగులు ఉపాధ్యాయులను ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేశారని గుర్తు చేశారు. ఇది సర్వీస్ రూల్స్‌కు భిన్నంగా జరిగినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలను గౌరవించి విధులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. డీఈఓను కలిసిన వారిలో సంఘాల సమాఖ్య ప్రతినిధులు సీహెచ్ రామునాయుడు, ఎస్.ఎస్.దొర, రవి, వాసుదేవరావు, రాజా, తదితరులు ఉన్నారు.
రుణ మంజూరు లక్ష్యం రూ.3వేల కోట్లు
● డీఆర్‌డీఏ పి.డి ఎం.శ్రీనివాస్‌పాణి
మెరకముడిదాం: జిల్లాలో ఉన్న డ్వాక్రా మహిళలకు రూ.3 వేల కోట్లు రుణాలు మంజూరుచేయడమే లక్ష్యమని డీఆర్‌డీఏ పి.డి. ఎం.శ్రీనివాస్‌పాణి అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో డ్వాక్రా సంఘాల అధ్యక్షులు, వీఓఏలతో ఏపీఎం రాజశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సంఘంలోని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. సీ్త్రనిధి, బ్యాంకు, సామాజిక పెట్టుబడి నిధి, పీఎంఈజీఎఫ్, పీఎంఎఫ్‌ఎంఈ పథకాల రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఎం రాజశేఖర్, సీసీలు పాల్గొన్నారు.
మస్తర్ల మాయాజాలం?
● చేసిన పనికి డబ్బులు రాలేదంటున్న
వేతనదారులు
బలిజిపేట: మండలంలోని పెద్దింపేటలో మస్తర్ల మాయాజాలంతో తాము చేసిన పనికి డబ్బులు నేటికీ రాలేదని వేతనదారులు ఆవేదన చెందుతున్నారు. ఉపాధి హామీ పథకంలో జూన్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పెద్దింపేటలో పనసవాని చెరువు పనిచేశామని తెలిపారు. పద్మావతి, భారతి, దేవి, శ్రీదేవి గ్రూపులతో పాటు 10గ్రూపులకు చెందిన సుమారు 300మంది వేతనదారులు పనులు చేశారు. వారికి 16302, 16303, 16304, 16305, 16306, 16307 నంబర్లతో మస్తర్లు వేశారు. నేటికీ వాటి సంగతి ఏమిటనేది తెలియడం లేదు. మస్తర్లు కొట్టారా? లేదా? అనేది ఎవరిని ప్రశ్నించినా సరైన సమాధానం లేకుండా పోయిందని వేతనదారులు ఎస్.నారాయణమ్మ, ఎం.పద్మ, భాగ్యలక్ష్మి, యు. రామలక్ష్మి తదితరులు తెలిపారు. మస్తర్లు కొట్టి ఉంటే మేట్ల ఫోన్ నంబర్‌కు మెసేజ్‌లు వచ్చి ఉండేవన్నారు. ఏమీ లేకుండా వాటిని ఏం మాయచేశారా? అని వేతనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తాము పనిచేసిన రోజులకు డబ్బులు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.


